అక్షరటుడే, వెబ్‌డెస్క్: Central Cabinet Expansion | కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. కానీ ఈసారి అసలు చర్చ “ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది?” అన్నదానికంటే… “తెలంగాణలో బీజేపీ భవిష్యత్ రాజకీయ సమీకరణాలను ఎవరి చేతుల్లో పెడతారు?” అన్న ప్రశ్న చుట్టూ తిరుగుతోంది.
తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో ఇప్పటికే కిషన్‌రెడ్డి Kishan Reddy, బండి సంజయ్ Bandi Sanjayప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు మరోసారి విస్తరణ, పునర్వ్యవస్థీకరణ జరిగితే రాష్ట్రం నుంచి కొత్త ముఖాలకు అవకాశం దక్కుతుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ రేసులో ఈటల రాజేందర్, డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, గడ్డం నగేశ్ పేర్లు వినిపిస్తున్నాయి.
Central Cabinet Expansion | ఒక మంత్రి పదవి.. నాలుగు రాజకీయ లెక్కలు!
ఢిల్లీ లెక్కలు కేవలం మంత్రి పదవులతో ముగిసేలా కనిపించడం లేదు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలను ఒకేసారి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం బీజేపీ అధిష్ఠానం ముందుంది.
ఈటల రాజేందర్‌కు అవకాశం ఇస్తే బలమైన బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చినట్లు అవుతుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఉన్న అనుభవం, మాస్ కనెక్ట్‌ను కేంద్ర బాధ్యతతో జత చేయవచ్చు.
ఇక డీకే అరుణకు అవకాశం ఇస్తే మహిళా ప్రాతినిధ్యం, దక్షిణ తెలంగాణ సమీకరణం, పార్టీకి ఉన్న సీనియర్ నాయకత్వ అనుభవం.. అంశాలు ఒకేసారి కలిసొచ్చే అవకాశం ఉంది.
అర్వింద్ ధర్మపురి అవకాశం ఇస్తే ఉత్తర తెలంగాణలో భాజపా దూకుడుకు మరో బలమైన రాజకీయ ముఖం లభించినట్లు అవుతుంది.
ఇదే సమయంలో గడ్డం నగేశ్ వంటి గిరిజన నాయకుడికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మరో సామాజిక సమీకరణాన్ని భాజపా బలపరచగలదు. ఈ కారణంగానే తెలంగాణ నుంచి ఎవరిని ఎంచుకోవాలన్నది సాధారణ కేబినెట్ నియామకంగా కాకుండా ఒక రాజకీయ వ్యూహంగా మారింది.
Central Cabinet Expansion | అసలు టార్గెట్… 2028!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం పెంచడం ద్వారా పార్టీకి రెండు ప్రయోజనాలు లభించవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
మొదటిది.. రాష్ట్రంలోని కీలక సామాజిక వర్గాలకు ఢిల్లీ స్థాయిలో ప్రాతినిధ్యం ఇవ్వడం. ఇక రెండోది.. కేంద్ర మంత్రులను రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ముఖాలుగా ఉపయోగించడం. అంటే మంత్రి పదవి ఢిల్లీలో ఉండొచ్చు… కానీ దాని రాజకీయ ప్రభావం తెలంగాణలో కనిపించాలన్నదే వ్యూహం.
ఇప్పటికే తెలంగాణలో భాజపా సంస్థాగత బలాన్ని పెంచేందుకు జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కూర్పు కూడా 2028 ఎన్నికల ముందస్తు రాజకీయ వ్యూహంలో భాగమవుతుందనే అంచనాలు ఉన్నాయి.
Central Cabinet Expansion | కాంగ్రెస్‌కు మరో సంకేతమా?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూడా కేబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ అంశంతో రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ సెప్టెంబరు 3న ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
అంటే ఒకవైపు రాష్ట్ర కాంగ్రెస్‌లో మంత్రి పదవుల కోసం ఆశావహుల లాబీయింగ్… మరోవైపు ఢిల్లీలో తెలంగాణ కోసం భాజపా తన “టీమ్”ను మరింత పదును పెట్టే ప్రయత్నం కొనసాగుతుందన్నమాట.
Central Cabinet Expansion | “మిషన్ ఎవరు?”
కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం వస్తుందన్నది రాబోయే రోజుల్లో తేలొచ్చు. కానీ రాజకీయంగా పెద్ద ప్రశ్న మాత్రం వేరే ఉంది. తెలంగాణలో భాజపాని అధికారానికి దగ్గర చేసే బాధ్యతను ఢిల్లీ ఎవరికి అప్పగించబోతోందన్నదే అసలైన ప్రశ్న. అది ఈటలకా? అర్వింద్కా? డీకే అరుణకా? లేదా మరో కొత్త ముఖానికా? అనేది వేచి చూడాల్సిందే.
Influencer Murder | ఇన్ఫ్లుయెన్సర్ను చెట్టుకు కట్టేసి.. నిప్పంటించి దారుణ హత్య
ఎంపిక ఒక్క నేత అయినా… దాని వెనుక లెక్క మాత్రం మంత్రి పదవిది కాదు. 2028 తెలంగాణ ఎన్నికల కోసం ఢిల్లీ ఇప్పుడే తన చెస్ బోర్డును సిద్ధం చేస్తోందా? అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్పన్నమవుతోంది.