Chaitanya Reddy Transfer | “ప్రజలతో మమేకం.. సేవలో సంతృప్తి.. విడిపోవడంలో భావోద్వేగం”.. చైతన్య రెడ్డి జర్నీ విత్​ కామారెడ్డి!

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: Chaitanya Reddy Transfer | కామారెడ్డి జిల్లా (Kamareddy District)తో ఏర్పడిన ఆత్మీయ అనుబంధం వెళ్లాల్సిందే.. కానీ మనసు ఒప్పుకోవడం లేదు. సవాళ్లతో నిండిన కేసులు, మహిళల భద్రత కోసం తీసుకున్న కఠిన చర్యలు, ప్రజలు తనపై ఉంచుకున్న నమ్మకం—ఇవన్నీ తన సేవా కాలాన్ని మరపురాని జ్ఞాపకాలుగా మార్చాయని కామారెడ్డి సబ్‌డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి భావోద్వేగంగా అన్నారు.

జనవరి 1, 2025 న బాధ్యతలు స్వీకరించిన చైతన్య రెడ్డి సుమారు 14 నెలల పాటు జిల్లాలో సేవలందించి, తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం పదోన్నతి పొంది సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ (Sangareddy Additional SP)గా వెళ్తున్నారు. ఈ సందర్భండి కామారెడ్డి జిల్లాతో ఏర్పడిన అనుబంధాన్ని, తన అనుభవాలను పంచుకున్నారు.

Chaitanya Reddy Transfer | మొదటి పోస్టింగ్…

ఏఎస్పీగా కామారెడ్డి తన మొదటి పోస్టింగ్ అని చైతన్య రెడ్డి తెలిపారు. ఇద్దరు ఎస్పీలతో కలిసి పనిచేసే అవకాశం తనకు అనేక విషయాలు నేర్పిందన్నారు. ఈ జిల్లాలో తాను పొందిన అనుభవం తన భవిష్యత్తు సేవా ప్రయాణానికి బలమైన పునాది అయ్యిందని పేర్కొన్నారు.

Chaitanya Reddy Transfer

Chaitanya Reddy Transfer | ప్రజల ప్రేమ… విడిచిపెట్టలేని బంధం

“కామారెడ్డి ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారు. అదే నాకు ఈ ప్రాంతంతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెంచింది. వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నా.. నా మనసు మాత్రం ఇక్కడే ఉండిపోతుంది..” అని ఆమె అన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై, ముఖ్యంగా మహిళలు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకొనే వాతావరణాన్ని సృష్టించగలిగామని చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) చెప్పారు.

Chaitanya Reddy Transfer | సవాళ్ల మధ్య సేవ

కామారెడ్డి జిల్లాలో మోసాలు, దొంగతనాలు, హత్యలు, నకిలీ కరెన్సీ కేసులు తనకు పెద్ద సవాళ్లుగా నిలిచాయని చైతన్య రెడ్డి అన్నారు. అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ప్రత్యేక అనుభవంగా నిలిచిందని పేర్కొన్నారు. “ఆపరేషన్ కవచ్” ద్వారా సదరు ముఠాలను కట్టడి చేయగలిగామని తెలిపారు.

మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు

మహిళల కేసుల్లో పారదర్శకతను పెంచేందుకు కృషి చేసినట్లు చైతన్య రెడ్డి చెప్పారు. షీ టీమ్‌ను బలోపేతం చేసి, స్వయంగా పర్యవేక్షించామని అన్నారు. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ధైర్యం పెరిగిందని, నేరుగా ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. ఫిర్యాదు చేయడానికి సంకోచించే బాధితుల వద్దకు మఫ్టీలో వెళ్లి ధైర్యం చెప్పిన ఘటనలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

పొక్సో కేసుల్లో నిష్పక్షపాత దర్యాప్తు

జిల్లాలో పోక్సో కేసులు పెరిగినప్పటికీ, ప్రతి కేసును నిష్పక్షపాతంగా విచారించామని ఆమె తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు. అవగాహన లోపం వల్ల వచ్చే సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.

యువతకు సందేశం

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. “గంజాయి, మద్యం వంటి వాటికి బానిస అయితే భవిష్యత్తు చీకటిలో పడుతుంది.. చదువు, లక్ష్యం మీద దృష్టి పెట్టాలి..” అని ఆమె హితవు పలికారు.

ఆటుపోట్లను అధిగమించి.. ఐపీఎస్​ కిరీటం చేజిక్కించుకుని

చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల ప్రేరణతో ఎదిగిన చైతన్య రెడ్డి, సివిల్స్‌పై దృష్టి పెట్టి ఎన్నో ఆటుపోట్లను అధిగమించి ఐపీఎస్ సాధించారు. “అమ్మానాన్నల ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది..” అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Municipality Debt | ఆదాయం పెరగాలి..అప్పులు తీరాలి : మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే KVR

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *