అక్షరటుడే వెబ్‌డెస్క్: CII Telangana AI Summit | హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ‘సీఐఐ తెలంగాణ ఏఐ సమ్మిట్-2026’ (CII Telangana AI Summit 2026) అత్యంత విజయవంతంగా ముగిసింది. “తెలంగాణ టు ది వరల్డ్ డ్రైవింగ్ గ్లోబల్ ఏఐ అండ్ జీసీసీ ట్రాన్స్‌ఫర్మేషన్” అనే ప్రధాన థీమ్‌తో సెప్టెంబర్ 23న హైదరాబాద్‌లో ఈ సమ్మిట్‌ను నిర్వహించారు. ఈ వేదికగా సాంకేతిక దిగ్గజాలు, పరిశ్రమ నిపుణులు, విధానకర్తలు , డిజిటల్ ఇన్నోవేటర్లు తెలంగాణలో ఏఐ (కృత్రిమ మేధస్సు) భవిష్యత్తుపై విస్తృతంగా చర్చించారు.
CII Telangana AI Summit | తెలంగాణ ఏఐ లక్ష్యాలు..
ఈ సమ్మిట్‌లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జూజు ( ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేవలం ఏఐని వినియోగించడమే కాకుండా, గ్లోబల్ మార్కెట్ల కోసం స్వయంగా ఏఐ ఉత్పత్తులు, ఐపీలు (IP), బిజినెస్‌లను సృష్టించడమే రాష్ట్ర ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రూ.3.13 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, దాదాపు 10 లక్షల మంది ఐటీ నిపుణులు, 3 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న 515 జీసీసీలతో బలమైన ఎకోసిస్టమ్ ఉందని తెలిపారు.
రాష్ట్రంలో 5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం, ఏఐ-గ్రేడ్ కంప్యూట్, సబ్సిడీపై జీపీయూ (GPU) యాక్సెస్ కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 2035 నాటికి ప్రపంచంలోని టాప్ 20 ఏఐ హబ్‌లలో తెలంగాణను నిలపాలనే లక్ష్యంతో ఏఐ ఇన్నోవేషన్ సంస్థ ‘ICAN’, ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పారిశ్రామిక వర్గాలు ఇక్కడే ఆవిష్కరణలు చేయాలని, పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
CII Telangana AI Summit | ఏఐ రంగంలో అగ్రగామిగా ..
రాష్ట్ర ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతుండగా, ఉత్పాదకతను సార్థక వ్యాపార ఫలితాలుగా మార్చడమే ప్రస్తుత సవాల్ అన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణ గ్లోబల్ స్థాయికి పరిష్కారాలు అందించగలదని పేర్కొన్నారు.
సీఐఐ తెలంగాణ చైర్మన్ ఎం. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏఐ బాధ్యతాయుతంగా, నమ్మకంగా ఉపయోగించడంపైనే అందరి దృష్టి ఉండాలన్నారు. అలాగే జీసీసీలు, స్టార్టప్‌లు, పరిశ్రమల భాగస్వామ్యంతో గ్లోబల్ మార్కెట్లకు అవసరమైన టెక్నాలజీని అందించాలని పలువురు నిపుణులు సూచించారు. హెచ్‌పీ ఇండియా డైరెక్టర్ నీలోత్పల్ కుమార్ దత్తా, ఐడీజీఎస్ ప్రెసిడెంట్ రాజన్ నవానీ తదితరులు మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఐదు సంవత్సరాలలో టెక్నాలజీ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ ఇందుకు సరైన వేదిక అని కొనియాడారు. ఈ సమ్మిట్ ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణను గ్లోబల్ ఏఐ రాజధానిగా తీర్చిదిద్దడానికి అవసరమైన రోడ్‌మ్యాప్ సిద్ధమైంది.
ఇది కూడా చదవండి: Nizamabad IT Tower | ఐటీ టవర్‌ను సందర్శించిన కలెక్టర్ భవేష్ మిశ్రా