Uttam Kumar Reddy | రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం..మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Uttam Kumar Reddy | ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారంలో రూ.26.93 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డ్యామ్‌లలోని నీటిని తాగు, సాగునీటి అవసరాలకు సమర్థంగా వినియోగించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Uttam Kumar Reddy | ప్రత్యేక చర్యలు..

ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడిందని మంత్రి వెల్లడించారు. వర్షాలను ఎవరూ నియంత్రించలేమని, అయితే అందుబాటులో ఉన్న వనరులతో ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడటమే ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. జూరాల  ( Jurala ) ఆయకట్టు కింద పంటలను రక్షించేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో మాట్లాడామని, తెలంగాణ విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సాగు చేసిన పంటలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, అవసరమైన చోట నీటిని విడుదల చేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.

Uttam Kumar Reddy | రూ.26.93 కోట్లతో అభివృద్ధి..

మేడారం గ్రామంలో రూ.26.40 కోట్లతో నిర్మించిన నేరేడుచర్ల–దూపాడు డబుల్ రోడ్డుతో పాటు, జానల్‌దిన్నె గ్రామపంచాయతీ భవనం, నేరేడుచర్ల గ్రంథాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం ద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని పునరుద్ఘాటించారు.

Uttam Kumar Reddy | దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..

రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంటే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ప్రజల్లో అవాస్తవాలు చెప్పి భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెరక సంఘం కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్, ఎస్పీ నర్సింహ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  Nizamabad IT Tower | ఐటీ టవర్​ను సందర్శించిన కలెక్టర్ భవేష్​ మిశ్రా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *