అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dairy Protein Nutrition | ఇప్పటివరకు కేవలం మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ఆధారంగానే వ్యాపారాన్ని అంచనా వేసుకున్న డెయిరీ పరిశ్రమలో ఇప్పుడు సరికొత్త మార్పు కనిపిస్తోంది.
పాలు, పెరుగు, పన్నీర్ వంటి ఉత్పత్తులను విక్రయించడమే కాకుండా.. అవి వినియోగదారుల ఆరోగ్యానికి ఎంతమేర పోషకాలను, ముఖ్యంగా ప్రొటీన్‌ను అందిస్తున్నాయనే అంశంపై కంపెనీలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. రోజువారీ ఆహారంలో పెరుగు, మజ్జిగను తప్పనిసరిగా తీసుకునే దక్షిణాది రాష్ట్రాలు ఈ మార్పుకు ప్రధాన వేదికగా నిలుస్తున్నాయి.
Dairy Protein Nutrition | పెరుగు వినియోగం రికార్డు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), కర్ణాటక తదితర దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతి నలుగురు పెద్దలలో ముగ్గురు ప్రతిరోజూ పాలు లేదా పెరుగును తీసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో తలసరి సగటు వినియోగం ఏడాదికి 2.8 కిలోలు మాత్రమే ఉండగా, దక్షిణాదిలో ప్యాక్ చేసిన పెరుగు వినియోగం ఏకంగా 4.2 కిలోలకు చేరి సరికొత్త రికార్డు నమోదు చేస్తోంది. దీంతో ప్రొటీన్ ఆధారిత డెయిరీ ఉత్పత్తులకు దక్షిణ భారతదేశం అతిపెద్ద మార్కెట్‌గా మారింది.
Dairy Protein Nutrition | అవగాహన లోపం..
డెయిరీ ఉత్పత్తుల వినియోగం భారీగా ఉన్నప్పటికీ, శరీరానికి అవసరమైన ప్రొటీన్ పరిమాణంపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన ఇంకా కలగలేదు. పట్టణ ప్రాంతాల్లో నివసించే ఆరుగురిలో నలుగురు రోజూ తగినంత ప్రొటీన్ తీసుకోవడం లేదని, ముగ్గురిలో నలుగురికి తమ బరువుకు తగ్గట్టు ఎంత ప్రొటీన్ అవసరమో స్పష్టత లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మార్గదర్శకాల ప్రకారం.. ఆరోగ్యకరమైన వయోజనులు తమ శరీర బరువులో ప్రతి కేజీకి 0.66 నుండి 0.83 గ్రాముల ప్రొటీన్‌ను తీసుకోవాలి.
Dairy Protein Nutrition | చైతన్యం తేవడమే లక్ష్యం..
ఈ మార్పుపై గోద్రెజ్ జెర్సీ సీఈఓ గౌరవ్ పాండే మాట్లాడుతూ.. దక్షిణాది ప్రజలకు పాలు, పెరుగు ప్రాముఖ్యతను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని, అది వారి ఆహార సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. అయితే, తాము తీసుకునే పెరుగు, పన్నీర్ వంటి పదార్థాల్లో లభించే ప్రొటీన్ విలువలను వినియోగదారులు శాస్త్రీయంగా గుర్తించేలా చైతన్యం తేవడమే డెయిరీ పరిశ్రమ ముందున్న అసలైన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
నేటి డిజిటల్ యుగంలో ఫిట్‌నెస్ యాప్‌ల ద్వారా క్యాలరీలను లెక్కించే నగరవాసులు కూడా, భోజనంలో తీసుకునే ఒక గిన్నె పెరుగులోని ప్రొటీన్ శాతాన్ని గమనించడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ అంశంపై వినియోగదారులకు సరైన అవగాహన కల్పించే డెయిరీ సంస్థలే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Losses | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు