అక్షరటుడే వెబ్‌డెస్క్:Delhi Fuel Saving Measures|పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, పొదుపు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగింది. ప్రభుత్వ యంత్రాంగంలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా పలు కీలక నిబంధనలను ప్రకటించారు, ఇవి శుక్రవారం నుంచే అమలులోకి రానున్నాయి.
Delhi Fuel Saving Measures|ఉద్యోగులకు ఊరట..
ప్రయాణాల వల్ల ఖర్చయ్యే ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఉద్యోగులకు వారానికి రెండు రోజుల పాటు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రకటించింది. దీంతో పాటు, కార్యాలయాల్లో జరిగే సమావేశాల్లో కనీసం 50 శాతాన్ని ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాలని ఆదేశించింది. ఇకపై ప్రతి సోమవారం అధికారులు తమ వ్యక్తిగత వాహనాలను వాడకుండా మెట్రోలోనే ఆఫీసులకు రావాల్సి ఉంటుంది. ఈ మార్పును ప్రోత్సహించేందుకు ఉద్యోగుల ప్రయాణ భత్యాన్ని (TA) 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Delhi Fuel Saving Measures|ముందడుగు వేసిన ముఖ్యమంత్రి..
ఇంధన పొదుపులో అందరికీ ఆదర్శంగా నిలవాలని సీఎం రేఖా గుప్తా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను నాలుగింటికి పరిమితం చేశారు. అందులో కూడా రెండు ఎలక్ట్రిక్ వాహనాలే ఉండటం విశేషం. అధికారులకు కేటాయించే నెలవారీ ఇంధన కోటాలో 20 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Delhi Fuel Saving Measures|ఖర్చులపై నియంత్రణ..
ఆర్థిక క్రమశిక్షణతో పాటు ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. రాబోయే ఆరు నెలల వరకు కొత్త వాహనాల కొనుగోలును నిలిపివేయడంతో పాటు, ఏడాది వరకు మంత్రులు, అధికారులు ఎటువంటి విదేశీ పర్యటనలు చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే, మూడు నెలల పాటు భారీ ఖర్చుతో కూడిన ప్రభుత్వ వేడుకలు ఉండవని సీఎం ప్రకటించారు.
Delhi Fuel Saving Measures|రవాణా వ్యవస్థలో మార్పులు..
ప్రభుత్వ సిబ్బంది కోసం 29 కాలనీల నుండి 58 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తూ రవాణా వ్యవస్థలో మార్పులు చేశారు. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ద్వారా ఇంధనం వృథా కాకుండా చూసేందుకు కార్యాలయ పనివేళలను కూడా సవరించారు. దేశ రాజధానిలో అమలు చేస్తున్న ఈ ‘పొదుపు మంత్రం’ ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలవనుంది.
ఇది కూడా చదవండి: Voter List Revision| మూడో దశ ఎస్‌ఐఆర్ షురూ.. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో ఓటర్ల వివరాల ధృవీకరణ


