అక్షరటుడే వెబ్డెస్క్: Telangana Public School | రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
Telangana Public School | విద్యారంగంలో సమూల మార్పులు..
రాష్ట్రంలోని 24 వేల పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్యను అందించడానికి విద్యాశాఖపై రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఆరుట్ల స్కూల్లో ఇప్పటికే 1814 మంది విద్యార్థులు చేరడం సంతోషకరమని, ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Telangana Public School | స్కిల్ యూనివర్సిటీ..
ఏఐ (AI) యుగంలో విద్యార్థులు ఉద్యోగాలకు సిద్ధమయ్యేలా, డిసెంబర్ 9న ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ని ప్రారంభించబోతున్నట్లు సీఎం వెల్లడించారు. భవిష్యత్తులో విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. గత ప్రభుత్వం కులాల వారీగా పాఠశాలలు పెట్టి విభజనను ప్రోత్సహించిందని, ఆ కుల వ్యవస్థను నిర్మూలించేందుకే తాము ‘ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు’ నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Telangana Public School | విమర్శలపై ఆగ్రహం..
ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్కు పిలిపించడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం తీవ్రంగా ఖండించారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టడం వారి కుసంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. 2034 ఒలింపిక్స్లో తెలంగాణ విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించేలా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం నాణ్యమైన విద్యా కిట్లను అందజేస్తుంటే, కొందరు పనిగట్టుకుని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, గణితం తెలియకుండానే వారు ఆరోపణలు చేస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు.
Telangana Public School | “భవిష్యత్తు నాయకులు మీరే”..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులే రేపటి దేశ నాయకులని సీఎం నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బ్రతికేలా విద్యార్థులు కష్టపడి చదవాలని, గొప్ప స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి, వారితో సరదాగా ఫుట్బాల్ ఆడారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh School Gayatri Mantra | బడుల్లో గాయత్రీ మంత్రం.. ఛత్తీస్గడ్ ప్రభుత్వం కీలక నిర్ణయం