El Nino 2026 | ప్రపంచాన్ని వణికిస్తున్న ఎల్‌నినో.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో (El Nino) ప్రపంచ వ్యాప్తంగా కలవరం సృష్టిస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: El Nino 2026 | పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో (El Nino) ప్రపంచ వ్యాప్తంగా కలవరం సృష్టిస్తోంది. పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరిగి కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అక్టోబర్ 22, 2026 నాటికి భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఏకంగా 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నట్లు అమెరికాకు చెందిన ‘నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్’ (NOAA) వెల్లడించింది. ఈ పరిణామాలు ఎల్‌నినో మరింత బలపడుతుందనడానికి స్పష్టమైన సంకేతాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

El Nino 2026 | ఎల్‌నినో అంటే ఏమిటి?

ఎల్‌నినో అనేది ఒక సహజ వాతావరణ ప్రక్రియ. ఇందులో భాగంగా మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే చాలా ఎక్కువగా వేడెక్కుతాయి. దీనివల్ల గాలుల వీచే దిశలో, మేఘాల కదలికల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అస్తవ్యస్తమవుతుంది. సాధారణంగా పొడిగా ఉండే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చే అవకాశం ఉండగా, వర్షాలు పడాల్సిన ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనా ప్రకారం, 2026 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి ఎల్‌నినో ప్రభావం అత్యున్నత స్థాయికి (గరిష్టానికి) చేరుకుంటుందని భావిస్తున్నారు.

El Nino 2026 | రికార్డు స్థాయికి సముద్ర ఉష్ణోగ్రతలు..

ఎల్‌నినోను అంచనా వేసే ‘నినో 3.4’ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల సగటు గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది జూన్‌లో సాధారణం కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్న ఉష్ణోగ్రత, ఆగస్టు నాటికి 2.5 డిగ్రీలకు చేరుకుందని WMO తెలిపింది. ఇక అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఈ వ్యత్యాసం ఏకంగా 3.7 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో 2015 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య నమోదైన 2.6 డిగ్రీల రికార్డును ఈసారి ఎల్‌నినో అధిగమించేలా కనిపిస్తోంది.

El Nino 2026 | భారతదేశంపై ఎల్‌నినో ప్రభావం ..

ఎల్‌నినో కారణంగా తీవ్రంగా నష్టపోయే దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. దీని ప్రభావంతో దేశంలో వర్షపాతం తగ్గిపోయి, ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాల ప్రకారం.. 2026 నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే దాదాపు 13 శాతం తక్కువగా నమోదైంది. రానున్న నెలల్లో దక్షిణాసియాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి:  Sircilla White Coat Ceremony | ఉత్తమ వైద్య సేవలతో ఉన్నత స్థానాలకు ఎదగాలి: కలెక్టర్​ గరిమ అగ్రవాల్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *