అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Sircilla White Coat Ceremony | వైద్య కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వైద్యులుగా ఉత్తమ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా (Sircilla District) కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైట్ కోట్ సెర్మనీకి ఎస్పీ మహేష్ బి గితేతో ఆమె హాజరయ్యారు.
Sircilla White Coat Ceremony | వైద్యం, విద్యకు అత్యంత ప్రాధాన్యత..
కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సమాజంలో వైద్యం, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపారు. వైద్యవిద్య అభ్యసించేందుకు చాలా కష్ట పడాల్సి ఉంటుందని, నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఈ అవకాశం వస్తుందని వివరించారు. ప్రతి విద్యార్థి విజయం వెనుక వారి తల్లిదండ్రుల శ్రమ, ప్రోత్సాహం ఉంటుందని పేర్కొన్నారు.
Sircilla White Coat Ceremony | వైద్యలు సేవలు అత్యంత కీలకం..
వైద్యుల సేవలు చాలా కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. గర్భిణులు, పిల్లలు, వివిధ రోగాలతో బాధ పడే వారికి వైద్యులు ఎంతో ఓపికతో సేవలు అందిస్తారని కొనియాడారు. వైద్యులు తాము ఎంచుకున్న విభాగంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సమాజ సేవలో భాగంగా వైద్యులు కొందరికైనా ఉచిత వైద్య సేవలు అందించాలని సూచించారు. దీంతో ఆత్మ సంతృప్తి ఉంటుందని తెలిపారు. వైద్యం, సేవల్లో మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని ఆకాక్షించారు. వైద్యులు తమ ఆరోగ్యం, ఆహారం శ్రద్ధ పెట్టాలని సూచించారు.
Sircilla White Coat Ceremony | త్వరలోనే వినియోగంలోకి నిర్మాణాలు..
సిరిసిల్ల వైద్య కళాశాల, బాలికల, బాలుర హాస్టల్ నిర్మాణ పనులను తాను పలుమార్లు సందర్శించానని పాలనాధికారి గుర్తు చేశారు. ప్రస్తుతం బాలికల హాస్టల్ వినియోగంలోకి వచ్చిందని తెలిపారు. మెడికల్ కాలేజీ, బాలుర హాస్టల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి.. త్వరలోనే వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ నిర్విష, తహశీల్దార్ మహేష్ కుమార్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్య విద్యార్థులకు వైట్ కోట్లు అందజేసి అభినందించారు.
ఇది కూడా చదవండి..: Minor Assault Case | యువతిపై ఇద్దరు మైనర్ల దాడి.. పోలీసులకు అప్పగించిన స్థానికులు