Energy Efficiency Summit | పొదుపు చేసే ప్రతి యూనిటే చౌకైన విద్యుత్: భట్టి విక్రమార్క

విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు, విద్యుత్‌ను సమర్థంగా వినియోగించడం , వృథాను అరికట్టడం అత్యంత కీలకమని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Energy Efficiency Summit| విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు, విద్యుత్‌ను సమర్థంగా వినియోగించడం , వృథాను అరికట్టడం అత్యంత కీలకమని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న 25వ సీఐఐ (CII) ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్-2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ బాధ్యతగా కాకుండా, ఆర్థిక పోటీతత్వాన్ని పెంచే శక్తివంతమైన వ్యూహంగా చూడాలని సూచించారు.

Energy Efficiency Summit | ప్రతి యూనిట్ చౌకైన విద్యుత్..

“ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం” అని భట్టి విక్రమార్క అభివర్ణించారు. మనం కొత్తగా ఉత్పత్తి చేసే విద్యుత్ కంటే, అవసరం లేని సమయంలో వినియోగించకుండా పొదుపు చేసే విద్యుత్ యూనిటే అత్యంత చౌకైనదని ఆయన పేర్కొన్నారు. మెరుగైన మోటార్లు, ఆధునిక శీతలీకరణ వ్యవస్థలు, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. దీనివల్ల ఉత్పత్తి , ప్రసార వ్యవస్థలపై ఒత్తిడి తగ్గుతుందని వివరించారు.

తెలంగాణలో పరిశ్రమలు, తయారీ రంగం, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయని.. ఫలితంగా భవిష్యత్‌లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని భట్టి అన్నారు. అయితే, డిమాండ్ పెరుగుతోందని అభివృద్ధి వేగాన్ని తగ్గించడం పరిష్కారం కాదని, ప్రతి యూనిట్ విద్యుత్‌తో మరింత ఆర్థిక వృద్ధిని సాధించేలా పరిశ్రమలు పనిచేయాలని సూచించారు.

Energy Efficiency Summit | పాటించాల్సిన  సూత్రాలు..

ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు పరిశ్రమలు “కొలవాలి.. పంచుకోవాలి.. విస్తరించాలి” అనే మూడు సూత్రాలను పాటించాలని పిలుపునిచ్చారు. దీన్ని ఏడాదికి ఒకసారి చేసే ఆడిట్‌గా కాకుండా నిరంతర నిర్వహణ ప్రక్రియగా మార్చాలని కోరారు. అలాగే, కృత్రిమ మేధస్సు (AI) సాయంతో విద్యుత్ వృథాను గుర్తించి వినియోగాన్ని మరింత సమర్థంగా నిర్వహించవచ్చని సూచించారు.

Energy Efficiency Summit | ఆర్థిక వ్యవస్థే లక్ష్యం..

తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న స్పష్టమైన లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని భట్టి తెలిపారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, అద్భుతమైన విమానాశ్రయం, రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పెట్టుబడిదారులను ‘సంపద సృష్టికర్తలు’గా భావిస్తున్నామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరికీ సాదర స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.

గత సంవత్సరం ఘనంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినట్లుగానే, ఈ సంవత్సరం డిసెంబర్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరై రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భట్టి విక్రమార్క కోరారు.

ఇది కూడా చదవండి:  Future City Investments | ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్​బాబు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *