Revanth Reddy Ticket | రేవంత్ చెప్పినంత మాత్రాన సీటు ఖరారైనట్టు కాదు!..పరకాల టికెట్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్.. కాంగ్రెస్‌లో మళ్లీ చర్చకు దారితీసిన అభ్యర్థిత్వ అంశం

అభ్యర్థుల ఎంపికలో పార్టీ అంతర్గత ప్రక్రియ, అధిష్ఠానం నిర్ణయం, ఎన్నికల సమీకరణాలు కీలకంగా మారే అవకాశం ఉంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్Revanth Reddy Ticket | తెలంగాణ Telangana కాంగ్రెస్‌లో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. పరకాలలో రేవూరి ప్రకాష్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి సభా వేదికగా పిలుపునివ్వడం ఇప్పటికే రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరలేపాయి.

“రేవంత్ రెడ్డి చెప్తే సీటు ఇచ్చినట్టు కాదు.. బీఫాం ఇచ్చినట్టు కాదు” అంటూ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థిని ముఖ్యమంత్రి సభలో ప్రస్తావించినంత మాత్రాన పార్టీ తరఫున అధికారికంగా అభ్యర్థిత్వం ఖరారైనట్లు కాదనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు.

Revanth Reddy Ticket | రేవంత్ ప్రకటనతో మొదలైన చర్చ

ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి.. రేవూరి ప్రకాష్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీఎం ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించడం పరకాల కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు కారణమైంది. రేవూరికి టికెట్ దాదాపు ఖరారైనట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా జరిగింది.

అయితే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు పార్టీ అధికారిక బీఫాం, టికెట్‌ ప్రకటనకు సమానం కాదని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

Revanth Reddy Ticket | పరకాలపై పలువురి కన్ను

పరకాల నియోజకవర్గంపై కాంగ్రెస్‌లో పలువురు నేతలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రేవూరి ప్రకాష్‌రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వడంపై ఇప్పటికే కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ప్రచారంలో ఉంది. మంత్రి కొండా సురేఖ కుటుంబానికి చెందిన కొండా సుస్మిత కూడా పరకాల నుంచి పోటీ చేసే ఆసక్తిని వ్యక్తం చేయడం గమనార్హం.

దీంతో పరకాల టికెట్ ఎవరికి దక్కుతుందన్న అంశం కాంగ్రెస్‌లో అంతర్గతంగా చర్చకు దారితీస్తోంది.

Revanth Reddy Ticket | తుది నిర్ణయం ఎవరితో?

మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో ఒక విషయం స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక నేతకు అనుకూలంగా సభలో పిలుపు ఇచ్చినా, దానినే అధికారిక టికెట్‌గా పరిగణించలేమన్న సంకేతం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చింది.

అభ్యర్థుల ఎంపికలో పార్టీ అంతర్గత ప్రక్రియ, అధిష్ఠానం నిర్ణయం, ఎన్నికల సమీకరణాలు కీలకంగా మారే అవకాశం ఉంది. దీంతో పరకాల టికెట్ విషయంలో రేవూరి ప్రకాష్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు ఉన్నప్పటికీ.. అధికారిక బీఫాం ఎవరికి దక్కుతుందనేది మాత్రం తుది నిర్ణయం తర్వాతే స్పష్టమవుతుంది.

Konda Surekha Controversy | కొండా వివాదానికి ముగింపు పడుతుందా?.. రాఖీతో రాజీ సాధ్యమేనా?

Revanth Reddy Ticket | కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు

ఒకవైపు సీఎం రేవంత్‌రెడ్డి రేవూరిని గెలిపించాలని బహిరంగంగా పిలుపునివ్వడం.. మరోవైపు టీపీసీసీ చీఫ్ “అది టికెట్ ఖరారు కాదు” అనే విధంగా వ్యాఖ్యానించడం తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల సీటుపై ఆసక్తిని మరింత పెంచింది.

ఇక రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రేవూరికే అవకాశం దక్కుతుందా? లేక కొత్త అభ్యర్థికి ఛాన్స్ ఇస్తుందా? అన్నది రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *