Fuel Shortage | పెట్రోల్ – డీజిల్ కొరతపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Fuel Shortage | రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి బంకులు మూతపడుతున్న పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) దృష్టి సారించారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంధన లభ్యం, సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసిన సీఎం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల వారీగా పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా, సరఫరా అంతరాయం కారణంగా సుమారు 421 బంకులు మూతపడినట్లు తెలిపారు.

Fuel Shortage | ప్ర‌జ‌ల్లో ఆందోళనే కార‌ణం..

అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇంధన కొరతపై భయాందోళనలతో ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేయడం (ప్యానిక్ బయ్యింగ్​) ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా మారింది. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుండగా.. శనివారం ఒక్కరోజే 10,345 కిలోలీటర్ల పెట్రోల్ Petrol, 14,156 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు నమోదయ్యాయి. అంటే డిమాండ్ ఒక్కసారిగా 50 శాతం కంటే ఎక్కువ పెరిగింది. సరఫరాను సుమారు 10 శాతం పెంచినప్పటికీ, పెరిగిన డిమాండ్‌ను తట్టుకోలేక బంకుల్లో నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో అనేక ప్రాంతాల్లో వినియోగదారులు బంకుల వద్ద బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది.

Fuel Shortage | ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి

ముఖ్యంగా ఆక్వా రంగంలో డ్రమ్ముల్లో ఇంధనం కొనుగోలు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, ఆక్వా రైతుల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకు కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులు కలిసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఇంధన కొరత నివారణకు తీసుకుంటున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రం లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకునే చర్యలతో పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Fuel Shortage | Cm Chandra babu naidu speaking at a conference

ఇది కూడా చదవండి..: Petrol Shortage | ఏపీలో పెట్రోల్​ కష్టాలు.. బంక్​ల దగ్గర బారులు తీరిన వాహనదారులు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *