Ganga Expressway Cracks | మోదీ ప్రారంభించిన రోడ్డు, నెలలోపే పగుళ్లు… అదానీ ఇదేంటి?

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ganga Expressway Cracks | ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘గంగా ఎక్స్‌ప్రెస్ వే’ ప్రారంభమైన నెల రోజులైనా కాకముందే దెబ్బతినడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు దాదాపు రూ.36,230 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ హైవేను ఈ సంవత్సరం ఏప్రిల్ 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. అయితే, ప్రజలకు అందుబాటులోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రోడ్డుపై పెద్ద ఎత్తున పగుళ్లు రావడం కలకలం రేపుతోంది.

Ganga Expressway Cracks | చేతుల్లోకి వచ్చేస్తున్న తారు..

హైవే నిర్మాణ నాణ్యతపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఒక వ్యక్తి రోడ్డు నాణ్యతను పరిశీలిస్తూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి రోడ్డుపై ఉన్న తారును చేత్తో లాగగా, అది ఎలాంటి శ్రమ లేకుండా ఒక్కసారిగా పెళ్లలుగా ఊడి చేతుల్లోకి వచ్చేసింది. రూ.వేల కోట్లు కుమ్మరించి నిర్మించిన రోడ్డు పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా అంటూ వాహనదారులు, నెటిజన్లు మండిపడుతున్నారు.

haiway

 

Ganga Expressway Cracks | ప్రారంభమైన నెల లోపే అధ్వాన్నంగా..

ఈ భారీ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ బాధ్యతల్లో సింహభాగం ప్రైవేట్ భాగస్వామ్యంతోనే జరిగింది. మొత్తం 594 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టులో దాదాపు 80 శాతం (సుమారు 464 కి.మీ) పనులను అదానీ గ్రూప్‌నకు చెందిన ‘అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్’ (ARTL) సంస్థే చేపట్టింది. మిగిలిన 20 శాతం పనులను ఐఆర్‌బీ (IRB) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది. ప్రధాన కాంట్రాక్ట్ అంతా అదానీ సంస్థే చూసుకోవడం, ప్రారంభమైన నెల లోపే రోడ్డు అధ్వాన్నంగా మారడంతో నిర్మాణ క్వాలిటీపై , పర్యవేక్షణ లోపాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

haiway.1

ఇది కూడా చదవండి: LIC Bonus Issue | ఎల్ఐసీ షేరు ధర ఢమాల్.. ఒక్కరోజులో 50 శాతం తగ్గిన విలువ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *