అక్షరటుడే, ఇందూరు: Hindu Sammelan | హిందువులకు తమ కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోసమే దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్(RSS) ఇందూరు విభాగ్ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నగరంలోని(Nizamabad City) నీలకంఠ బస్తీ ఆధ్వర్యంలో శ్రీరామ గార్డెన్లో (Sri Rama Garden) నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేశారు.
Hindu Sammelan | ప్రపంచానికి నాగరికత నేర్పింది భారత దేశం..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి బట్ట కట్టడం తెలియని నాడే భారతీయులు వేదాలు అధ్యయనం చేశారని, ప్రపంచానికి నాగరికతను నేర్పింది భారతదేశమని అందుకే ఈ దేశాన్ని విశ్వ గురువుగా పిలుస్తుంటారని తెలిపారు. అలాంటి మహోన్నతమైన దేశం పదేపదే విదేశీయుల దురాక్రమణలో మగ్గిపోయి స్వాతంత్య్రాన్ని కోల్పోవడానికి కారణాలు ఏమిటని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులైన డాక్టర్ హెడ్గేవార్(Dr. Hedgewar) ఆలోచించేవారన్నారు. అనంతరం భారతదేశ అనుభవిస్తున్న అన్ని సమస్యలకు ఏకైక కారణం ఈ దేశం మూలవాసులైన హిందువులు ఒకటిగా లేకపోవడం అనే విషయాన్ని గుర్తించి హిందూ సంఘటనే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ను స్థాపించినట్లు ఆయన తెలిపారు.
Hindu Sammelan | నాగ్‌పూర్‌లో ప్రారంభం..
డాక్టర్ హెడ్గేవార్ 1925 నాగపూర్‌లో ప్రారంభించిన చిన్న శాఖ నేడు కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోనే వందకు పైగా దేశాల్లో శాఖలను విస్తరించిందని వరంగంటి శ్రీనివాస్ అన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న అతి కొద్ది కాలంలో సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటితం చేసి మళ్లీ దేశాన్ని విశ్వగురు స్థానం మీద నిలబెట్టడమే లక్ష్యం కావాలని ఆయన సూచించారు. ఆర్ఎస్ఎస్ ఎవరికి వ్యతిరేకంగా పనిచేయదని కేవలం హిందువులను సంఘటితం చేయడం కోసం మాత్రమే పనిచేస్తుందని ఆయన పునరుద్ధరించారు, హిందూ సమాజాన్ని రకరకాల ప్రయత్నాల ద్వారా విచ్ఛిన్నం చేసే కుట్రలు అనాది కాలం నుంచే జరుగుతున్నాయన్నారు. వాటన్నింటిని ఎదుర్కొని హిందువులు తమ ధర్మం కోసం నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.
Hindu Sammelan | మానవజాతిని ధర్మమార్గంలో నడిపేందుకే వేదాలు..
వేద పండితుడు సతీష్ ఆచార్య మాట్లాడుతూ వేదాలు కేవలం హిందువుల కోసం రాసినది కావని సమస్త మానవజాతిని ధర్మ మార్గంలో నడపడం కోసమే వేదాలు రాయబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి(Hindu sameelana Samithi) అధ్యక్షులు ఉసెం రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగుల అశోక్, కోశాధికారి భాగవత పురుషోత్తం శర్మ, కార్యవర్గ సభ్యులు భూమేశ్వర్, చంద్రమోహన్, నాగేశ్వర్ రావు, గోపి, పాండురంగారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: CI & SI Caught by ACB | స్టేషన్ బెయిల్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై

