అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆక్రమణల భారీన పడకుండా రెండు కుంటలను హైడ్రా సిబ్బంది గురువారం కాపాడారు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు గ్రామంలోని ‘ఇస్తారిబాయి కుంట’ను, శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని కుడికుంట చెరువును హైడ్రా రక్షించింది. ఈ చెరువులను కబ్జా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం అధికారులు చర్యలు చేపట్టారు. 2.5 ఎకరాల ప్రభుత్వ భూమి (సర్వే నంబర్ 248) విస్తీర్ణంలో ఉన్న ఇస్తారిబాయి కుంట వద్ద, చెరువు ప్రాంతంలో నిర్మించిన ఆక్రమణ కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారు. చెరువు పూర్తి నీటి మట్టం (FTL) పరిధిలో అమ్మకం కోసం చేపట్టిన అనధికార ప్లాటింగ్ పనులను నిలిపివేసింది.
HYDRAA | ఫెన్సింగ్ ఏర్పాటు
బఫర్ జోన్‌లో రెడీ-మిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నిర్వాహకుడు ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను తొలగించి, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా అధికారులు ఫెన్సింగ్ వేశారు. సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండవర్ ద్వారా అభివృద్ధి చేసిన 8 ఎకరాల విస్తీర్ణంలోని కుడికుంట చెరువు వద్ద అనధికార కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువు సరిహద్దుల్లోని 300 చదరపు గజాల స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది.
దీనిని కూడా చదవండి : Cyberabad Demolitions | సైబరాబాద్‌లో కొనసాగుతన్న కూల్చివేతలు