అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipality Vigilance | కామారెడ్డి మున్సిపాలిటీలో (Kamareddy Municipality) అక్రమాలపై విజిలెన్స్ అధికారులు స్పందించారు. బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయంటూ కౌన్సిలర్లు చేసిన ఫిర్యాదుపై గురువారం విచారణ చేపట్టారు.
Kamareddy Municipality Vigilance | మూడు నెలల క్రితం..
మూడు నెలల క్రితం మున్సిపాలిటీలో శానిటేషన్, వాటర్ వర్క్స్, 14వ, 15వ ఫైనాన్స్, స్పెషల్ డెవలప్మెంట్ పనుల బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత లేదని, కమిషనర్ పర్వతాలు, అకౌంటెంట్ రాములు ఇష్టానుసారంగా బిల్లులు చెల్లిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. 1వ వార్డ్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, 21వ వార్డ్ కౌన్సిలర్ తాటి లావణ్య, 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ఎంఏఅండ్యూడీ, విజిలెన్స్, సీడీఎంఏ, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు వారు ఫిర్యాదు చేశారు. దీంతో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల విజిలెన్స్ అధికారుల బృందం గురువారం కామారెడ్డిలో తనిఖీలు చేపట్టింది. పట్టణంలోని పలు వార్డుల్లో ప్యాచ్ వర్క్స్ పరిశీలించడంతో పాటు 12వ వార్డులో సీసీ రోడ్డు, 14వ వార్డులో బోర్ మోటార్, 15, 16, 17 వార్డుల్లో స్ట్రీట్ లైట్స్, పాత బస్టాండ్ నుంచి ధర్మశాల వరకు ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్స్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
Kamareddy Municipality Vigilance | ప్యాచ్‌వర్క్ పనుల్లో..
ప్యాచ్ వర్క్ పనుల్లో చేపట్టాల్సిన దానికన్నా ఎక్కువగానే పనులు చేసినట్లుగా గుర్తించినట్లు సమాచారం. 12వ వార్డులో పాత పనులకు బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణపై విచారించగా, గతంలో చేసిన పనులకు బిల్లు రాకపోవడంతో ప్రస్తుతం తీసుకున్నట్లు నిర్ధారించుకున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం డంపింగ్ యార్డును పరిశీలించిన అధికారులు మున్సిపల్ కార్యాలయంలో పనులకు సంబంధించిన ఎంబీలు, ఇతర రికార్డులను పరిశీలించారు. పలు రికార్డులను వెంట తీసుకుని వెళ్లిన అధికారులు తనిఖీలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఇండియాలో తగ్గుతున్న జననాలు.. మరో సంక్షోభం తప్పదా?