అక్షరటుడే వెబ్‌డెస్క్: India Visa Reforms | విదేశీయులు భారత్‌ను ( India )సందర్శించడాన్ని మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వీసా నిబంధనల్లో కీలక సంస్కరణలు చేపట్టింది. ఇప్పటివరకు ఉన్న సంక్లిష్టతలను తొలగిస్తూ ప్రధాన వీసా కేటగిరీల సంఖ్యను 13 నుంచి 9కి, అలాగే ఉప-కేటగిరీలను 49 నుంచి 23కి తగ్గించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు , వైద్య చికిత్స కోసం వచ్చే విదేశీయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ భారీ ప్రక్షాళన చేసినట్లు అధికారులు వెల్లడించారు. వివిధ కేటగిరీల మధ్య ఉన్న గందరగోళాన్ని పూర్తిగా తొలగించి, స్పష్టమైన ప్రత్యామ్నాయాలను అందించడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
India Visa Reforms | ఇకపై ‘విజిటర్ వీసా’..
కొత్త విధానంలో భాగంగా వీసా దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు దరఖాస్తుదారులకు సమయం ఆదా అయ్యేలా కేంద్ర హోం శాఖ చర్యలు తీసుకుంది. అన్ని ఉప-కేటగిరీలలోనూ వీసా ఫారమ్‌లలో నింపాల్సిన వివరాలను ఏకంగా 65 నుంచి 70 శాతం వరకు తగ్గించారు. దీనివల్ల దరఖాస్తు చేయడం ఎంతో సులువు కానుంది. అంతేకాకుండా, గతంలో వాడుకలో ఉన్న ‘టూరిస్ట్ వీసా’ పేరును ఇకపై ‘విజిటర్ వీసా’ (Visitor Visa) గా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
India Visa Reforms | వీసాల పునర్వ్యవస్థీకరణ..
సాధారణ పర్యాటకులతో పాటు వైద్యం, విద్య, వ్యాపార అవసరాల నిమిత్తం భారత్‌కు వచ్చేవారి కోసం ఆయా వీసా నిబంధనలను కూడా మరింత సరళతరం చేస్తూ పునర్వ్యవస్థీకరించారు. ఈ సరికొత్త నిబంధనలను ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేసేందుకు కేంద్ర హోంశాఖ తన ఐటీ వ్యవస్థలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోంది. ఈ నూతన ఫ్రేమ్‌వర్క్ ద్వారా వీసాల జారీ ప్రక్రియ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని అధికారులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Police Officers Killed | కశ్మీర్లో అదృశ్యమైన ఇద్దరు పోలీసుల మృతి