అక్షరటుడే వెబ్డెస్క్: Indian Sailors Death | గల్ఫ్ ప్రాంతంలో యూఎస్ నేవీ జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది.
Indian Sailors Death |మెతకగా వ్యవహరించడం సరికాదని..
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జరిపిన చర్చల్లో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ వ్యవహరించిన తీరు అత్యంత బలహీనంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ( Pawan Khera ) ఆరోపించారు. మన దేశ పౌరులు మరణించినా, ‘దాడులు సమర్థనీయం కావు’ అంటూ చాలా సున్నితమైన భాషను వాడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మన పౌరులను పొట్టనబెట్టుకున్న దేశాన్ని కఠినంగా నిలదీయాల్సింది పోయి, ఇలా మెతకగా వ్యవహరించడం సరికాదని ఆయన దుయ్యబట్టారు. దీనికి విరుద్ధంగా, అమెరికా మంత్రి రూబియో ప్రకటన మాత్రం భారతదేశాన్ని హెచ్చరించేలా అత్యంత కఠినంగా ఉండటం గమనార్హమని ఖేరా పేర్కొన్నారు.
Indian Sailors Death | అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన..
యుద్ధాలు లేదా ఘర్షణలు జరుగుతున్నప్పుడు వాటితో సంబంధం లేని వాణిజ్య నౌకలపై దాడులు చేయకూడదని అంతర్జాతీయ చట్టాలు స్పష్టం చేస్తున్నాయని పవన్ ఖేరా వివరించారు. ‘సాన్ రెమో మాన్యువల్’ , 1949 నాటి ‘జెనీవా కన్వెన్షన్’ నియమాలను అమెరికా సైన్యం బాహాటంగా ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ఇంతటి భారీ తప్పిదానికి పాల్పడిన అమెరికాను భారత్ గట్టిగా నిలదీసి, అధికారికంగా క్షమాపణలు కోరాల్సి ఉందని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ఇటువంటి మెతక వైఖరి వల్ల అంతర్జాతీయ సమాజంలో భారతదేశ ప్రతిష్ట దిగజారుతోందని పవన్ ఖేరా ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Ponnam on SIR | అర్హుల ఓటు హక్కు తొలగించకుండా చూడాలి : మంత్రి పొన్నం