అక్షరటుడే వెబ్డెస్క్: Indur Oora Pandaga | ఆషాఢ మాసంలో ఇందూరు నగరంలో ఎంతో ఘనంగా జరిగే ‘ఊర పండుగ’ కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలోని ఖిల్లా ప్రాంగణంలో ఉన్న అమ్మవార్ల గద్దెలను భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగుపరుస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ( Dhanpal Suryanarayana ) ప్రకటించారు. బుధవారం ఆయన సర్వ సమాజ్ కమిటీ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో గద్దెలను పరిశీలించారు.
Indur Oora Pandaga | భక్తులకు సౌకర్యంగా..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భక్తులు ఎక్కడి నుంచి చూసినా అమ్మవార్లు స్పష్టంగా కనిపించేలా గద్దెల ఎత్తును పెంచుతున్నామని తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని గద్దెల వద్ద అదనపు నిర్మాణాలను చేపట్టనున్నట్లు, తద్వారా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పనులను వేగంగా పూర్తి చేసి, ఊర పండుగ నాటికి ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అలాగే గద్దెల చుట్టూ ఉన్న స్థలాన్ని చదును చేసి, భక్తులకు అనుకూలంగా మార్చాలని అధికారులను ఆదేశించారు.

Indur Oora Pandaga | కమిటీ సభ్యుల హర్షం..
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని మూడో ఆదివారం ఊర పండుగ నిర్వహించడం ఆనవాయితీ అని కమిటీ ప్రతినిధులు తెలిపారు. అయితే, ఈసారి అదే రోజున సంకటహర చతుర్థి రావడంతో పండుగ నిర్వహణపై తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గద్దెల అదనపు నిర్మాణానికి ఎమ్మెల్యే చొరవ చూపడంపై కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ కార్యదర్శి బంటు రాజేశ్వర్, కన్వీనర్ రామర్తి గంగాధర్, స్థానిక కార్పొరేటర్లు మల్కాయ్ మహేందర్, నాగోల్ల లక్ష్మీనారాయణ, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, అర్చనా చిరంజీవి, వివిధ సంఘాల ప్రతినిధులు , మాజీ కార్పొరేటర్ బాలకిషన్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవడి: Kamareddy Flood Prevention | వరదల నియంత్రణకు చర్యలు.. డ్రైనేజీలు, కాలువల్లో పూడికతీత