Kamareddy Flood Prevention | వరదల నియంత్రణకు చర్యలు.. డ్రైనేజీలు, కాలువల్లో పూడికతీత

కామారెడ్డి పట్టణంలో వరదల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. కాలువలు, డ్రైనేజీల్లో పూడిక తొలగిస్తున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Flood Prevention | ఏడాది క్రితం కురిసిన కుండపోత వర్షాలకు కామారెడ్డి (Kamareddy) పట్టణం చివురుటాకులా వణికిపోయింది. జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ సహా అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మోకాళ్ల లోతు నీళ్లు ఇళ్లలోకి చేరడంతో వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. నిత్యావసరాలు, విద్యుత్ లేక ప్రజలు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఆ చేదు జ్ఞాపకాల నేపథ్యంలో ప్రస్తుతం మున్సిపల్ పాలకవర్గం అప్రమత్తం అయింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో వరదల నియంత్రణకు చర్యలు ప్రారంభించింది.

కామారెడ్డి పట్టణంలోని డ్రైయినేజీలు, కాలువలు పూడికతో నిండిపోయాయి. వరద కాలువల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో వర్షాలు వస్తే వరద నీరు సాఫీగా వెళ్లే మార్గం లేక రోడ్లపైకి వస్తోంది. దీంతో దాంతో మున్సిపల్ అధికారులు పూడిక తీత పనులు ప్రారంభించారు. కాలువలన్ని శుభ్రం చేస్తున్నారు.

మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి, కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది పట్టణమంతా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ‘ఈసారి ఒక్క కాలనీ కూడా మునగడానికి వీల్లేదు, ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు’ అనే స్పష్టమైన లక్ష్యంతో వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి, వాటికి తక్షణ పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందించారు.

Kamareddy Flood Prevention | హై అలెర్ట్​ జోన్లుగా..

వరదలతో గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీలతో పాటు గాంధీనగర్, బతుకమ్మ కుంట, ఎన్జీవోస్ కాలనీ, విద్యానగర్, వినాయక్ నగర్‌లను ‘హై అలర్ట్’ జోన్లుగా మున్సిపాలిటీ గుర్తించింది. ముఖ్యంగా జీఆర్ కాలనీ నుంచి వెళ్లే ప్రధాన వరద కాలువ చెట్లు, పొదలతో పూర్తిగా మూసుకుపోయి ఉండటమే గత ఏడాది వరదలకు ప్రధాన కారణమని తేలింది. చెరువు నుంచి వచ్చే నీరు పారే మార్గం లేక కాలనీలన్నీ మునిగిపోయాయి. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగానే ఆయా పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

Kamareddy Flood Prevention | పనులు ప్రారంభం

సమస్యాత్మక ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. జీఆర్ కాలనీ వరద కాలువను జేసీబీల సాయంతో పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తున్నారు. కాలువ వెంబడి ఉన్న పొదలు, చెత్త, మట్టిని పూర్తిగా తొలగిస్తున్నారు. గాంధీనగర్, బతుకమ్మ కుంట, ఎన్జీవోస్ కాలనీ, విద్యానగర్‌లలో డ్రైనేజీ లైన్లలో పేరుకుపోయిన పూడికను సిబ్బందితో తీయిస్తున్నారు. అవసరమైన చోట్ల జేసీబీలు, టిప్పర్లను వినియోగించి పనులు వేగవంతం చేశారు. ‘గతేడాది రాత్రికి రాత్రే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ఈసారి ముందే పనులు మొదలు పెట్టడంతో కాస్త ధైర్యంగా ఉంది’ అని కౌండిన్య కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Kamareddy Flood Prevention | శాశ్వత పరిష్కారం దిశగా

తాత్కాలిక పూడికతీతతోనే ఆగకుండా, భవిష్యత్తులో వరద ముప్పు పూర్తిగా తొలగించేందుకు మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. వరద నీటి నిర్వహణ కోసం ప్రత్యేక ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. స్ట్రామ్ వాటర్ డ్రైన్ల నిర్మాణం వంటి పనులకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణం పూర్తయితే సగం వరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ముందస్తు చర్యలు

– ఇప్ప ఉమారాణి, మున్సిపల్ ఛైర్​పర్సన్​

గత ఏడాది కామారెడ్డి పట్టణంలో వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా జీఆర్, కౌండిన్య కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే ఆ కాలనీలు మరోసారి వరద బారిన పడకుండా వరద కాలువ పూడిక తీత పనులు రూ.2 లక్షల వ్యయంతో యుద్ధప్రాతిపదికన మొదలుపెట్టాం. ప్రతి వార్డులో డ్రైనేజీలను సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం. విలీన గ్రామాల్లో పిల్ల కాలువలను కూడా శుభ్రం చేయిస్తున్నాం. అవసరమైన చోట జేసీబీలను ఉపయోగిస్తున్నాం. ప్రజలు కూడా కాలువల్లో చెత్త వేయకుండా సహకరిస్తే కామారెడ్డిని వరద రహిత పట్టణంగా తీర్చిదిద్దుకోవచ్చు.

దీనిని కూడా చదవండి : Urea Protest | యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. జాతీయ రహదారిపై రాస్తారోకో

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *