అక్షరటుడే, బోధన్: Drug Awareness | విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని.. డ్రగ్స్ రహిత నిజామాబాద్‌కు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సీపీ సాయిచైత్యన్య(CP Sai Chaitanya) అన్నారు. పట్టణంలోని ఇందూరు మోడల్ స్కూల్లో (Indur model school)విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Drug Awareness | యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది
సీపీ మాట్లాడుతూ.. యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందన్నారు. జూన్ 22 నుండి జూన్ 26 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో (Anti Drug Campaign) భాగంగా.. విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు జరుపుతున్నట్లు సీపీ తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తుల జీవితాలను మాత్రమే కాకుండా దేశభవిష్యత్తును సైతం దెబ్బతీస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం దాదాపు రూ.400 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు.
Drug Awareness | అప్రమత్తంగా ఉండాలి..
యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డయల్ ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నెంబర్ 1908కు సంప్రదించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో నిజామాబాద్ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ‘సే నో టూ డ్రగ్స్..సే ఎస్ టూ లైఫ్’ అని పిలుపునిచ్చారు.
Drug Awareness | యాంటీ డ్రగ్స్ సెల్ఫీ పాయింట్..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘యాంటీ డ్రగ్ సోల్జర్’ సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభించిన సీపీ..యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డ్రగ్స్‌కు సంబంధించిన డ్రాయింగ్, వ్యాసరచన పోటీలో గెలుపొందిన సాత్విక, శ్రీనిధి, శ్రీజల్, పాటిల్ శృతి, అక్షర, కోయల్శ్రీ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకటనారాయణ, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రూరల్ ఎస్సై రాజశేఖర్, విద్యా వికాస్ జూనియర్ కాలేజీ కరస్పాండెంట్ శ్రీనివాస్, ట్రస్మా ఛైర్మన్ హరికృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: రాణించిన ఐటీ, బ్యాంకింగ్ రంగాలు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు