Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​.. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లకు మరిన్ని అధికారాలు ఇచ్చింది. అర్హులైన దరఖాస్తుదారులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకుంటే గృహాలు పొందవచ్చని వెల్లడించింది. గృహ నిర్మాణ మంజూరు నిరంతర ప్రక్రియ అని పేర్కొంది.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) సోమవారం ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. పథకాన్ని వేగంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు కలెక్టర్లకు అధికారాలను వికేంద్రీకరించి, మరిన్ని బాధ్యతలు అప్పగిస్తోందని తెలిపారు. ప్రజా ప్రతినిధులతో మెరుగైన సమన్వయం కోసం, క్షేత్రస్థాయిలో సమస్యలను నివారించడానికి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. ఉమ్మడి నిజామాబాద్​, ఆదిలాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.

Indiramma Housing Scheme | కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు

ఇందిరమ్మ గృహ పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు కూడా ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. అర్హులని తేలితే వారికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కాగా గతంలో రేషన్​ కార్డు (Ration Card) లేకపోవడంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ప్రస్తుతం కొత్తకార్డులు రావడంతో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో జరిగిన సర్వే ఆధారంగానే ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా కొత్త దరఖాస్తులకు అవకాశం కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Indiramma Housing Scheme | ఇతరులకు కేటాయించాలి

లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేని, కట్టుకోవడానికి ఇష్టపడని సందర్భాలలో, ఆ యూనిట్లను ఇతర అర్హులైన వ్యక్తులకు తిరిగి కేటాయించాలని మంత్రి ఆదేశించారు. బేస్‌మెంట్ దశ పూర్తయిన వెంటనే, ముఖ్యంగా సాంకేతిక సమస్యల కారణంగా బిల్లుల చెల్లింపు ఆలస్యమైన చోట, బకాయి ఉన్న చెల్లింపులను తక్షణమే విడుదల చేయాలని సూచించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్​ రూమ్ ఇళ్లను పూర్తి చేయాలన్నారు.

Indiramma Housing Scheme | భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

సమగ్ర భూ సర్వే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సర్వే చేపడుతున్నట్లు వివరించారు. సాదా బైనామాల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తామని, కొనుగోలుదారుడి నుంచి ఒక డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని అన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి, నిర్ణయాధికారాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారులకు (RDO) అప్పగించారు.

దీనిని కూడా చదవండి : Farmers Issue | రైతుల పరిస్థితి దారుణం.. ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం: కేసీఆర్

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *