అక్షరటుడే, హైదరాబాద్: BRS Party | తెలంగాణ భవన్ వేదికగా బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు (26వ ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా జరిగిన ఈ భేటీలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత మార్పులు , ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
BRS Party | కమిటీల రద్దు
పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ మినహా, ప్రస్తుతం ఉన్న అన్ని స్థాయిల కమిటీలను (గ్రామ, మండల, జిల్లా) రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కొత్త కమిటీల నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఈ కమిటీలకు రాజకీయ పరిజ్ఞానం, పార్టీ సిద్ధాంతాలపై శిక్షణా తరగతులు నిర్వహించే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించారు. ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ విధానాల్లో సభ్యత్వ నమోదును భారీ ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు.
BRS Party | పెద్ద ఎత్తున ఉద్యమాలు
రైతుల సమస్యలపై కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. “మా హయాంలో ఒక్క గింజ కూడా వదలకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం. కానీ ఇప్పుడు రైతులు రోడ్లపై కన్నీరు పెడుతున్నారు. ధాన్యం కొనలేని చేతకాని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది” అని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే, బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఎంపీల మౌనంపై తీవ్ర ఆగ్రహం
పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ , బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలంగాణను తిడుతుంటే మీకు పౌరుషం లేదా? మీరు ఇక్కడ పుట్టిన వాళ్లేనా?” అని ప్రశ్నించారు. ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఒక్క బీఆర్‌ఎస్ ఎంపీ ఉన్నా సభలో క్షమాపణ చెప్పించేవాళ్ళమని, నేడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన చెందారు.
వారివి చిల్లర కూతలు
ప్రస్తుత ప్రభుత్వంపై కేసీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పాలన వదిలేసి కూల్చివేతలు, భూముల కబ్జాల్లో ఈ ప్రభుత్వం నెంబర్ వన్‌గా నిలిచింది అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరును ఉద్దేశించి “వారివి చిల్లర కూతలు, చిల్లర మాటలు.. వారిని చూస్తుంటే జాలి వేస్తోంది” అని వ్యాఖ్యానించారు.
జీవన్ రెడ్డిని పార్టీ జనరల్ సెక్రెటరీగా..
ఈ సమావేశంలో జీవన్ రెడ్డిని పార్టీ జనరల్ సెక్రెటరీగా నియమిస్తున్నట్లు కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఆయనను కార్యవర్గ సభ్యులకు పరిచయం చేస్తూ, పార్టీ బలోపేతానికి ఆయన సేవలు వినియోగించుకుంటామని తెలిపారు.
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన, పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు (26వ ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా తెలంగాణ భవన్లో కొనసాగుతున్న ప్రత్యేక సమావేశం.
ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS సహా.. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు,… pic.twitter.com/cRm8KVkFZO
— BRS Party (@BRSparty) April 27, 2026
ఇది కూడా చదవండి..: BRS Formation Day | కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేసే వరకు పోరాడుతాం : కేటీఆర్

