International Medical Tourism | తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం’!

"ప్రభుత్వ ఆసుపత్రులు ముందుగా స్థానిక ప్రజల వైద్య అవసరాలను వంద శాతం తీర్చడంపై దృష్టి పెట్టాలా? లేక విదేశీ రోగుల కోసం ప్రత్యేక వసతులు కల్పించాలా?" అనే చర్చ, ప్రశ్నలు సామాజిక వర్గాల నుంచి వచ్చే అవకాశం ఉంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: International Medical Tourism | తెలంగాణను అంతర్జాతీయ వైద్య పర్యాటక (International Medical Tourism) హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్ఠాత్మకమైన ముందడుగు వేసింది.

ఇప్పటివరకు కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకే పరిమితమైన అంతర్జాతీయ రోగుల వైద్య సేవలను, ఇకపై ప్రభుత్వ రంగంలోని ప్రతిష్ఠాత్మక ఆసుపత్రుల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

తెలంగాణ స్టేట్ టూరిజం పాలసీ 2025–2030లో భాగంగా ‘మెడికల్ & వెల్నెస్ టూరిజం’ను ఒక కీలక రంగంగా గుర్తించిన ప్రభుత్వం, తాజాగా దాని అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

International Medical Tourism | ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

ఈ ప్రతిష్ఠాత్మక నిర్ణయానికి సంబంధించి విధివిధానాలు, ప్రత్యేక వసతులు, చికిత్స ప్యాకేజీలు, ధరల నిర్ణయం, విదేశీ రోగులకు అందించాల్సిన సహాయక సేవలపై అధ్యయనం చేసి, సిఫార్సులు చేయడానికి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు జూన్ 6, 2026న G.O.Rt.No.178 (హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్) ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

International Medical Tourism | కమిటీలోని సభ్యులు

  • డాక్టర్ గౌరవ్ ఉప్పల్, IAS (మేనేజింగ్ డైరెక్టర్, TGMSIDC)
  • పి. గౌతమి, IAS (మేనేజింగ్ డైరెక్టర్, TGTDC లిమిటెడ్)
  • డాక్టర్ బీరప్ప (డైరెక్టర్, NIMS)

International Medical Tourism | కమిటీ పరిశీలించబోయే అంశాలు (Terms of Reference):

ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చొంగ్తు సంతకంతో విడుదలైన ఈ ఉత్తర్వుల ప్రకారం, కమిటీ కింది అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది.

ప్రత్యేక అంతర్జాతీయ బ్లాక్: సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆసుపత్రిలో అంతర్జాతీయ వైద్య పర్యాటకం కోసం ఒక ప్రత్యేక ‘ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం బ్లాక్’ ఏర్పాటు ప్రక్రియను పరిశీలించడం.

చికిత్సలు & ధరల ప్యాకేజీలు: ప్రభుత్వ వైద్య సంస్థల్లో విదేశీ రోగులకు అందించాల్సిన వైద్య, శస్త్రచికిత్స, డయాగ్నోస్టిక్ సేవలను గుర్తించడం. వాటికి సంబంధించిన ప్యాకేజీ ధరలు/ధరల నిర్ణాయక విధానాన్ని సిఫార్సు చేయడం.

సహాయక సేవలు: విదేశీ రోగుల కోసం లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్లు (భాషా అనువాదకులు), వారి సంస్కృతికి తగ్గ ప్రత్యేక ఆహారం (customized diet), అటెండెంట్ వసతులు, ఇతర సేవలను సూచించడం.

ప్రమోషన్ అండ్ మార్కెటింగ్: తెలంగాణ మెడికల్ & వెల్నెస్ టూరిజం ప్రమోషన్ బోర్డుతో సమన్వయం చేసుకుంటూ మార్కెట్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయంగా దీనిని ప్రమోట్ చేయడం.

ఈ కమిటీ తన పూర్తి నివేదిక, సిఫార్సులను ఒక నెల రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

TIMS
TIMS

International Medical Tourism | రంగంలోకి టిమ్స్, నిమ్స్..

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున విదేశీ రోగులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగంలోని నిమ్స్ (NIMS), టిమ్స్ (TIMS) వంటి ప్రతిష్టాత్మక సంస్థలను కూడా ఈ రేసులోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరడంతో పాటు ప్రభుత్వ వైద్య రంగం అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

International Medical Tourism | భిన్నాభిప్రాయాలు

అయితే, ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని పేద, మధ్యతరగతి ప్రజల వైద్య అవసరాలకు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారం. ఇప్పటికే నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో రోగుల రద్దీ విపరీతంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో, “ప్రభుత్వ ఆసుపత్రులు ముందుగా స్థానిక ప్రజల వైద్య అవసరాలను వంద శాతం తీర్చడంపై దృష్టి పెట్టాలా? లేక విదేశీ రోగుల కోసం ప్రత్యేక వసతులు కల్పించాలా?” అనే చర్చ, ప్రశ్నలు సామాజిక వర్గాల నుంచి వచ్చే అవకాశం ఉంది.

స్థానిక రోగుల సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఈ అంతర్జాతీయ బ్లాక్‌లను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంచనుందనేది కమిటీ నివేదిక వచ్చాకే స్పష్టత రానుంది.

TIMS Sanathnagar Trial | సమస్త వైద్య సేవల సమాహారం టిమ్స్​.. ఈ వైద్యాలయ ప్రత్యేకతలు ఎన్నో.. నేటి నుంచి ఓపీ!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *