అక్షరటుడే వెబ్‌డెస్క్: Iran Internet Cables | హర్మూజ్ జలసంధిని మూసివేసి అంతర్జాతీయంగా చమురు సంక్షోభం సృష్టించిన ఇరాన్, ఇప్పుడు ప్రపంచానికి మరో కొత్త తలనొప్పి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ జలసంధి గుండా సముద్రగర్భంలో వెళ్లే అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుళ్లపై ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ అధికారిక మీడియాలో ఈ మేరకు ఒక సంచలన కథనం ప్రచురితమైంది.
Iran Internet Cables | టెక్ దిగ్గజాలే లక్ష్యంగా కొత్త నిబంధనలు..
సముద్రగర్భ కేబుళ్లను (Subsea Cables) ఉపయోగిస్తున్న గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ కంపెనీల నుంచి భారీగా రుసుములు వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఈ కంపెనీలన్నీ ఇరాన్ చట్టాలకు లోబడి ఉండేలా, సబ్‌మెరైన్ కేబుల్ ఆపరేటర్లు లైసెన్స్ ఫీజులు చెల్లించేలా కొత్త నిబంధనలు తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాదు, ఈ కేబుళ్ల నిర్వహణ, మరమ్మతు పనుల హక్కులను కూడా ఇరాన్ కంపెనీలకే అప్పగించాల్సి ఉంటుందని ఆ కథనం పేర్కొంది. ఈ ఫీజులు చెల్లించని సంస్థల డేటా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తామని ఇరాన్ మిలిటరీ ప్రతినిధి ఒకరు సోషల్ మీడియా (X) వేదికగా హెచ్చరించడం గమనార్హం. అయితే అమెరికా ఆంక్షల కారణంగా ప్రస్తుతం టెక్ కంపెనీలు ఇరాన్‌కు ఎలాంటి చెల్లింపులు చేసే అవకాశం లేదు.
Iran Internet Cables | ప్రపంచ వ్యాప్తంగా ‘డిజిటల్’ వ్యవస్థకు ముప్పు..
ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్నెట్, డేటా ట్రాఫిక్‌కు సముద్రగర్భ కేబుల్సే ప్రధాన ఆధారం. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్‌లను, యూరప్‌ను అనుసంధానించే కీలక డిజిటల్ లింకులు ఈ హర్మూజ్ జలసంధి గుండానే వెళ్తున్నాయి. భారతదేశానికి వచ్చే ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో కూడా దీని వాటా చాలా ఎక్కువ. ఒకవేళ ఈ కేబుళ్లకు అంతరాయం కలిగితే అంతర్జాతీయంగా డిజిటల్ కనెక్టివిటీ దెబ్బతింటుంది. ఇంటర్నెట్ వేగం క్షీణించి బ్యాంకింగ్ రంగాలు, మిలిటరీ కమ్యూనికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అంతర్జాతీయ లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.
Iran Internet Cables | ఇరాన్ చర్య చట్టబద్ధమేనా
ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS-1982) ప్రకారం తీరప్రాంత దేశాలకు తమ ప్రాదేశిక జలాల్లోని కేబుళ్లపై నియంత్రణ ఉండే హక్కు ఉంది. కానీ, ఇరాన్ ఈ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఆమోదించలేదు. ప్రస్తుతం ఈజిప్ట్ దేశం సూయజ్ కాలువ ద్వారా వెళ్లే కేబుళ్లపై ఫీజులు వసూలు చేస్తోంది. దాన్నే ఇరాన్ ఉదాహరణగా చూపుతోంది. అయితే సూయజ్ కాలువ మానవ నిర్మితం (కృత్రిమమైనది), కానీ హర్మూజ్ సహజసిద్ధమైన జలసంధి. ఇది ఇరాన్ ప్రాదేశిక జలాల పరిధిలోకి రాదని అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తీసుకోబోయే చర్యలపై ప్రపంచ టెక్ కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: Kerala New CM| కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం


