అక్షరటుడే వెబ్డెస్క్: JP Nadda Opposition | రాజ్యసభలో ప్రతిపక్షాల తీరుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, సభా నాయకుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ ( Parliament )సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభ సజావుగా సాగకుండా ప్రతిపక్షాలు కావాలనే ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల వద్ద లేవనెత్తడానికి ఎలాంటి కీలకమైన సమస్యలు లేవని, నిరంతరం తమ డిమాండ్లను మారుస్తూ (షిఫ్టింగ్ గోల్పోస్ట్స్) సభను తప్పుదోవ పట్టిస్తున్నారని నడ్డా మండిపడ్డారు. గతంలో చర్చలు జరిగిన ప్రతిసారీ సరుకు లేని ప్రతిపక్షాలకు తగిన సమాధానం లభించి భంగపాటు తప్పలేదని గుర్తుచేశారు.
JP Nadda Opposition | చర్చకు ప్రభుత్వం సిద్ధం
ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన అంశంపైనే మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చను ప్రారంభించాల్సి ఉందని, విచారణకు ఒక బిల్లు కూడా రానుందని తెలిపారు. ఇవన్నీ తెలిసినప్పటికీ సభను జరగనివ్వకుండా నిరసనలు తెలపడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం మానుకుని, సభా నిబంధనలకు కట్టుబడి చర్చల్లో పాల్గొనాలని జేపీ నడ్డా హితవు పలికారు. పదే పదే మాట మారుస్తూ పార్లమెంట్ విలువైన సమయాన్ని వృథా చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
ఇది కూడా చదవండి: AAP Paper Leak | ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ ఆగ్రహం