Kamareddy Power Cuts | ఆగమైతున్న అన్నదాత.. కరెంట్​ లేక కళ్లెదుటే ఎండిపోతున్న పంటలు

విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వ్యవసాయానికి సరిపడా కరెంట్ లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Power Cuts | విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వ్యవసాయానికి సరిపడా కరెంట్ లేకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. వేసవికాలం కూడా కాకపోవడంతో కరెంట్ కోతలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kamareddy Power Cuts | కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో పంటలు ప్రస్తుతం ఈనిక, పొట్ట దశలో ఉన్నాయి. ప్రస్తుతం పంటలకు సరిపడా నీళ్లు అవసరం ఉంది. నీళ్లుపారితే తప్ప పంట బతికే అవకాశం లేని సమయంలో త్రీఫేస్ కరెంట్ అన్నదాతలను ఆగం చేస్తోంది. పంటలకు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.

Kamareddy Power Cuts | జిల్లాలో పంటల సాగు వివరాలు

కామారెడ్డి జిల్లాలో సాగు పూర్తిగా బోరుబావులపై ఆధారపడి ఉంది. జిల్లాలో మొత్తం 5 లక్షల ఎకరాలకు పైగా సాగుభూమి ఉండగా, ప్రస్తుత వానాకాలంలో పంటల సాగు వివరాలు ఇలా ఉన్నాయి. వరి పంట 3,14,251 ఎకరాలు, సోయాబీన్ 87,736 ఎకరాలు, కంది 48,315 ఎకరాల్లో సాగవుతోంది. అలాగే మొక్కజొన్న 47,237 ఎకరాలు, పత్తి 45,864 ఎకరాలు, పెసర 2,198 ఎకరాలు, మినుము 1,851 ఎకరాలు, చెరకు 573 ఎకరాలు సాగవుతున్నాయి. ఇంత భారీ విస్తీర్ణంలో పంటలు సాగవుతున్న తరుణంలో కరెంట్ కోతలు పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సకాలంలో విద్యుత్ సరఫరా చేయకపోతే జిల్లాలో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.

Kamareddy Power Cuts | ఎండిపోతున్న పంటలు..

జిల్లాలో ప్రస్తుతం వరి, సోయా, పత్తి, మొక్కజొన్న పంటలు కీలకమైన ఎదుగుదల దశలో ఉన్నాయి. ఈ సమయంలో నీరు అందకపోతే పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. గత 10రోజులుగా మూడు ఫేజుల కరెంట్ కేవలం 5 నుంచి 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని, అది కూడా తక్కువ వోల్టేజీతో వస్తుండటంతో బోర్లు నీరు పోయడం లేదని రైతులు వాపోతున్నారు. రోజూ రాత్రి వేళల్లో కరెంట్ ఇస్తుండటంతో పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయమేస్తోందని అంటున్నారు. పాము కాటు, తేలు కాటు భయంతో రాత్రి మోటార్లు ఆన్ చేయలేకపోతున్నామని, దీంతో రూ.వేలల్లో ఖర్చు చేసిన వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని కన్నీరు పెడుతున్నారు. బీబీపేట, రాజంపేట్, సదాశివనగర్, గాంధారి, బాన్సువాడ మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని రైతులు చెబుతున్నారు.

Kamareddy Power Cuts | కరెంటు కోసం రోడ్డెక్కుతున్న వైనం..

విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో రైతులు చివరికి రోడ్డెక్కక తప్పలేదు. మంగళవారం పలు మండల కేంద్రాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్లను రైతులు ముట్టడించారు. ప్రధాన రహదారులపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పాల్వంచ, లింగంపేట మండలాల్లో రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు 24 గంటల నాణ్యమైన కరెంట్ అన్నారు. ఇప్పుడు 3 గంటలు కూడా సరిగా ఇవ్వడం లేదు. మా పంటలు ఎండిపోతుంటే అధికారులు ఏసీ గదుల్లో కూర్చున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kamareddy Power Cuts | విద్యుత్ అధికారులపై ఆగ్రహం

కరెంట్ కోతలపై రైతులు విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, ట్రాన్స్​ఫార్మర్లు కాలిపోయినా పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య వస్తోందని ఆరోపిస్తున్నారు. లైన్లపై చెట్ల కొమ్మలు పడినా తొలగించడం లేదని అంటున్నారు. వెంటనే వ్యవసాయానికి రోజుకు కనీసం 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Care Degree College Bathukamma | కేర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *