అక్షరటుడే, వెబ్‌డెస్క్: Khamenei Funeral | ఇరాన్ Iran మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ Ayatollah Ali Khamenei రాష్ట్ర అంత్యక్రియలకు భారత అధికారిక ప్రతినిధి బృందం హాజరైనందుకు ఇరాన్ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రకటన విడుదల చేసింది. భారత్ పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహబంధానికి నిదర్శనమని పేర్కొంది.
Khamenei Funeral | ఐదు అరబ్ దేశాల ప్రభుత్వాలతో మాట్లాడి..
ఇరాన్ ప్రకటన వెలువడిన నేపథ్యంలో, అమెరికా దౌత్యపరమైన ఒత్తిడి కారణంగా కనీసం 13 దేశాలు ఖమేనీ అంత్యక్రియలకు దూరంగా ఉన్నాయని, తమ ప్రతినిధుల స్థాయిని తగ్గించాయని ఇరాన్‌కు చెందిన సెమీ-అధికారిక తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వ్యక్తిగతంగా కనీసం ఐదు అరబ్ దేశాల ప్రభుత్వాలతో మాట్లాడి అంత్యక్రియలకు హాజరు కాకూడదని సూచించినట్లు ఆ కథనం పేర్కొంది.
Khamenei Funeral | భారత్ పాల్గొనడం విలువైన పునాదిగా..
భారత్ తరఫున విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీట, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ అధికారికంగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ కేంద్ర విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీతో పాటు పలు మతాలకు చెందిన ఆధ్యాత్మిక ప్రముఖులు కూడా హాజరయ్యారు.
భారత్ ప్రభుత్వం, ప్రజలకు ఇరాన్ రాయబార కార్యాలయం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ సానుభూతి, స్నేహపూర్వక వైఖరిని ఇరాన్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్ పాల్గొనడం విలువైన పునాదిగా నిలుస్తుందని వెల్లడించింది.
Khamenei Funeral | ఇరాన్‌తో చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలకు ప్రాధాన్యం
ఇదిలా ఉండగా, తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం, అంత్యక్రియలకు వారం రోజుల ముందే అమెరికా పలు దేశాలపై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చిందని ఆరోపించింది. ఖమేనీ అంత్యక్రియలకు అధికారిక ప్రతినిధులను పంపితే అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయా దేశాలకు హెచ్చరించినట్లు పేర్కొంది.
అమెరికా ఒత్తిడితో తూర్పు యూరప్‌నకు చెందిన మూడు దేశాలు, ఐదు ఆఫ్రికా దేశాలు, రెండు గల్ఫ్ దేశాలు, రెండు తూర్పు ఆసియా దేశాలు కలిపి మొత్తం 13 దేశాలు తమ ప్రతినిధుల స్థాయిని తగ్గించాయని, పూర్తిగా దూరంగా ఉన్నాయని తస్నీమ్ వెల్లడించింది. అయితే ఆ దేశాల పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఈ ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ లేదా మార్కో రుబియో ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ఇక పరిశోధకుడు మెహ్రాన్ హఘిరియన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యల ప్రకారం, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ దేశాలు అధికారిక ప్రతినిధి బృందాలను పంపగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), కువైట్, బహ్రెయిన్ మాత్రం అంత్యక్రియలకు అధికారికంగా హాజరుకాలేదు.
భారత్ మాత్రం తన సుదీర్ఘ విదేశాంగ విధానానికి అనుగుణంగా కార్యక్రమంలో పాల్గొంది. మధ్యప్రాచ్యంలోని వివిధ దేశాలతో సమతుల్య సంబంధాలను కొనసాగిస్తూ, ఇరాన్‌తో చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మరోసారి స్పష్టం చేసింది.