అక్షరటుడే వెబ్‌డెస్క్: Khelo India Youth Games | జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా “ఖేల్ కీ బాత్.. పీఎం కే సాత్” కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi )దేశవ్యాప్తంగా ఉన్న యువత, అథ్లెట్లతో వర్చువల్ విధానంలో మాట్లాడారు. ‘ఖేలో ఇండియా సంవాద్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 1,500కు పైగా కాలేజీల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలు, ఫిట్‌నెస్ ప్రాముఖ్యతతో పాటు దేశాభివృద్ధిలో యువత పాత్ర గురించి ప్రధాని దిశానిర్దేశం చేశారు.
Khelo India Youth Games | మేజర్ ధ్యాన్‌చంద్ చేసిన కృషి..
దేశ ప్రజలకు, క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. వందేళ్ల క్రితం భారత హాకీ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన చారిత్రక విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. “ఆటలంటే కేవలం పతకాలు గెలవడం మాత్రమే కాదు, అవి వ్యక్తిత్వాన్ని, కుటుంబాన్ని, దేశాన్ని ఉన్నత స్థాయికి చేర్చుతాయి. క్రీడలు కేవలం చాంపియన్లనే కాకుండా ఉత్తమ పోటీదారులను తయారుచేస్తాయి. జీవితంలో కిందపడినా తిరిగి లేచి గెలిచే దృఢ సంకల్పాన్ని ఇస్తాయి” అని పేర్కొన్నారు.
Khelo India Youth Games | భవిష్యత్ క్రీడా లక్ష్యాలు..
2012 ఒలింపిక్స్‌లో భారత్ కేవలం 12 రకాల ఆటల్లో మాత్రమే పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. మన దేశానికి సుదీర్ఘ సముద్ర తీరం, మంచు పర్వతాలు ఉన్నందున.. సర్ఫింగ్, వింటర్ స్పోర్ట్స్ వంటి విభిన్న క్రీడల్లోనూ మన యువత రాణించాలని పిలుపునిచ్చారు. రాబోయే 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ఇప్పటి నుంచే పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. 5 నుండి 15 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ‘టాలెంట్ హంట్’ నిర్వహించాలని సూచించారు. దేశంలో అత్యాధునిక స్పోర్ట్స్ సెంటర్లతో పాటు స్పోర్ట్స్ సైన్స్, మెరుగైన కోచింగ్ అందిస్తున్నట్లు తెలిపారు.
Khelo India Youth Games | 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్..
ఈ సమావేశంలో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే డిసెంబర్‌లో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తెలంగాణ వేదికగా జరగనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ క్రీడా పోటీలను చాలా వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Balaji Sweet House | స్వీట్ షాపుపై పోలీసుల దాడి.. కేసు నమోదు