అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kisan Helpline | ప్రభుత్వాలు వివిధ పనుల కోసం టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచుతాయి. అయితే ఆయా నంబర్లకు ఫోన్ చేసే ప్రజలకు పలు సందర్భాల్లో వింత అనుభవాలు ఎదురు అవుతుంటాయి. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం జరుగుతుంటుంది. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎదురైంది.
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Chief Minister Mohan Yadav) ఒక వినూత్న ప్రయత్నం చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయనే స్వయంగా ‘కిసాన్ హెల్ప్‌లైన్’ నంబర్‌కు ఫోన్ చేసి అధికారుల పనితీరును పరీక్షించారు. అయితే, ఆ సమయంలో ఎదురైన అనుభవం ముఖ్యమంత్రిని విస్మయానికి గురిచేసింది.
Kisan Helpline | సామాన్య రైతుగా
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాకుండా, ఒక సాధారణ పౌరుడిలా కిసాన్ హెల్ప్‌లైన్‌కు సీఎం కాల్ చేశారు. తనను తాను ఒక సామాన్య రైతుగా పరిచయం చేసుకున్న ఆయన.. ప్రస్తుత వేసవి సీజన్‌లో ‘మూడో పంట’ (Third Crop) కింద ఏ పంట వేస్తే లాభదాయకంగా ఉంటుందో చెప్పాలని, తగిన సలహాలు ఇవ్వాలని సిబ్బందిని కోరారు.
Kisan Helpline | సమాచారం లేదు
ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు హెల్ప్‌లైన్ సిబ్బంది పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. “ప్రస్తుతం మా దగ్గర ఆ సమాచారం అందుబాటులో లేదు. మీ ఫోన్ నంబర్ నోట్ చేసుకుంటాం, తర్వాత నిపుణుల ద్వారా కాల్ చేయిస్తాం” అని బదులిచ్చారు. దీనితో ఆశ్చర్యపోయిన సీఎం.. “కనీసం ఇప్పుడు ప్రాథమిక సమాచారం కూడా చెప్పలేరా?” అని మరోసారి ఆరా తీశారు. అయినప్పటికీ, తమ వద్ద సమాచారం లేదని సిబ్బంది స్పష్టం చేయడంతో సీఎం మౌనంగా ఉండిపోయారు.
Kisan Helpline | సీఎం అసహనం
రైతులకు తక్షణ సలహాలు, సూచనలు అందించాల్సిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో కనీస సమాచారం లేకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం లేదా సరైన శిక్షణ లేకపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హెల్ప్‌లైన్ల పనితీరును సమీక్షించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించే అవకాశం ఉంది.
దీనిని కూడా చదవండి : Gas Price Hike | ఒక్కరోజే రూ. 993 పెరిగిన గ్యాస్ ధరలు.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం

