Kolkata Sairang Express | అస్సాం రైలు ప్రమాదం.. వైరల్ అవుతున్న లాస్ట్ మినిట్ విజువల్స్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kolkata Sairang Express | అస్సాంలోని కామరూప్ (మెట్రోపాలిటన్) జిల్లా డిగారు రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతా నుంచి మిజోరాం సైరాంగ్ వెళ్తున్న కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 13125) పట్టాలు తప్పింది. బుధవారం ఉదయం సుమారు 6:54 గంటలకు ఈ ఘటన జరిగింది. డిగారు స్టేషన్‌లో మరో రైలుకు మార్గం ఇచ్చేందుకు (క్రాస్ చేయడానికి) ఈ ట్రైన్‌ను నిలిపే ప్రయత్నం చేయగా, వేగం అదుపు తప్పి పట్టాలు తప్పినట్లు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్) వెల్లడించింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్‌తో పాటు ఏడు కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి.

Kolkata Sairang Express | ఏమీ పనిచేయడం లేదు..

ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు లోకోమోటివ్ లోపల తీసినట్లు చెబుతున్న ఒక భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో లోకో పైలట్ బ్రేకింగ్ సిస్టమ్‌ను పదే పదే ఆపరేట్ చేస్తూ రైలును నిలిపేందుకు తీవ్రంగా శ్రమించడం కనిపిస్తోంది. అయినప్పటికీ రైలు వేగం తగ్గకపోవడంతో.. “కుచ్ నహీ కామ్ కర్ రహా.. కుచ్ భీ కామ్ నహీ కామ్ కర్ రహా హై” (ఏమీ పనిచేయడం లేదు) అంటూ పైలట్ ఆందోళనగా గట్టిగా అరవడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఆ తర్వాత రైలు బ్యారికేడ్‌లను ఢీకొట్టడంతో భారీ శబ్దం వచ్చి ఇంజిన్ ఒక్కసారిగా కంపించింది. అయితే, ఈ వైరల్ వీడియోను రైల్వే శాఖ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. బ్రేకులు ఎందుకు ఫెయిల్ అయ్యాయనేదానిపై విచారణ జరగాల్సి ఉంది.

Kolkata Sairang Express | రెస్క్యూ ఆపరేషన్..

ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కపింజల్ కిషోర్ శర్మతో పాటు పలువురు సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు (రెస్క్యూ ఆపరేషన్) ప్రారంభించారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తుండగా, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వేరే రైలులో గమ్యస్థానాలకు తరలించారు.

Kolkata Sairang Express | వేగమే కారణమన్న అధికారులు..

ఈ రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. లోకో పైలట్ రైలు వేగాన్ని అదుపు చేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, వైరల్ వీడియోలో కనిపిస్తున్న బ్రేక్ వైఫల్య కోణంతో పాటు అన్ని అంశాలపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

ఇది కూడా చదవండి:  Air India Hijack Threat | ఎయిరిండియా విమానం నుంచి హైజాక్ అలర్ట్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *