అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konda Sushmita Revanth Reddy | తెలంగాణ Telangana కాంగ్రెస్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. కొండా దంపతుల కుమార్తె కొండా సుష్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలు, ఆపై ప్రభుత్వం తీసుకున్న ఊహించని నిర్ణయం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌ను తీవ్ర శోధనలోకి నెట్టింది.
మాజీ మంత్రి కొండా సురేఖను ముందస్తు సమాచారం లేకుండా మంత్రివర్గం నుంచి హఠాత్తుగా బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్రస్థాయిలో ఎమోషనల్ అయ్యారు.
Konda Sushmita Revanth Reddy | 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని బలిచేస్తారా?
లైవ్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైన సుష్మిత.. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
“నేను కార్యకర్తల మనోధైర్యాన్ని కాపాడటానికి మాట్లాడాను. నేను మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఒకవేళ తప్పు ఉందనుకుంటే నాపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేయండి.. నేను జైట్లోనే ఉంటా. కానీ 40 ఏళ్ల మచ్చలేని రాజకీయ చరిత్ర ఉన్న మా అమ్మను బలి చేయడం ఎంతవరకు న్యాయం?” అని నిలదీశారు.
కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసే ముందు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం దారుణమని, ఒక సీనియర్ మహిళా నాయకురాలిని తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Konda Surekha Rakhi | కొండా సురేఖతో అందుకే రాఖీ కట్టించుకున్న : సీఎం రేవంత్ రెడ్డి
“పార్టీలో ఆమె అయినా ఉండాలి.. లేదా నేనైనా ఉండాలి అనే స్థాయికి ఒక ముఖ్యమంత్రి దిగజారుతారా? సీఎం రేవంత్ రెడ్డి పగబట్టి, సరైన అవకాశం కోసం చూసి మా అమ్మ మంత్రి పదవిని ఊడబెరికారు” అని సంచలన ఆరోపణలు చేశారు.
Konda Sushmita Revanth Reddy | అవినీతి ఆరోపణలకు కట్టుబడే ఉన్నా!
మంత్రి పదవి ఊడినా తన వైఖరిలో మార్పు లేదని సుష్మిత స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పట్ల తమ కుటుంబానికి ఎంతో గౌరవం ఉందన్న ఆమె.. ఒక వ్యక్తి, ఆయన కుటుంబం కోసం పార్టీ సిద్ధాంతాలను పక్కనబెట్టి తలవంచడాన్ని తీవ్రంగా నిరసించారు.
“నా వల్ల ఈ పరిస్థితి వచ్చినా మా తల్లిదండ్రులు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఒక బిడ్డగా మా అమ్మకు జరిగిన అవమానాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను” అని కన్నీటిపర్యంతమయ్యారు.
Konda Sushmita Revanth Reddy | వరంగల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు
ప్రస్తుతానికి వేరే పార్టీలోకి మారే ఆలోచన లేదని, ప్రజల మధ్యలోనే ఉండి రాజకీయంగా పోరాడతామని సుష్మిత ప్రకటించారు. అయితే, కొండా సురేఖ బర్తరఫ్ పరిణామం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపింది.
కొండా దంపతుల తదుపరి అడుగు ఏమిటి? వారు పార్టీలోనే ఉండి తిరుగుబాటు చేస్తారా.. లేక సొంత దారి చూసుకుంటారా? అనే అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.