అక్షరటుడే, వెబ్డెస్క్: Krishna River Flood | కృష్ణానదికి వరద కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటకలో కురస్తున్న వర్షాలతో వరద పోటెత్తింది. దీంతో నదిపై గల జలాశయాలు కళకళలాడుతున్నాయి.
కృష్ణానదిపై కర్ణాటకలోని జలాశయాలు ఇప్పటికే నిండాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణలోని జూరాల ప్రాజెక్ట్ నిండటంతో.. గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది. రెండు రోజులుగా శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో శ్రీశైలం జలాశయానికి భారీ వరద వచ్చే అవకాశం ఉంది.
Krishna River Flood | నారాయణపూర్ నుంచి..
కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 118.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 68 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. దిగువకు 64 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆల్మట్టి డ్యామ్ నుంచి, ఎగువ ప్రాంతం మీదుగా వచ్చే నీటి ప్రవాహం 80,000 క్యూసెక్కులకు పెరగడంతో, నారాయణపుణ్ నుంచి దిగువకు 90 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా నదిపై ఉన్న ఉజ్జని డ్యామ్ నుంచి 60,000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. దీంతో జూరాలకు త్వరలో లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్ట్ నిండటంతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా, గేట్లు ఎత్తి శ్రీశైలం జలాశయానికి నీటిని వదులుతున్నారు.
ఇది కూడా చదవండి..: Manhole Accident | మ్యాన్హోల్లో పడి వృద్ధుడి గల్లంతు