అక్షరటుడే, వెబ్డెస్క్ : Lashkar Bonalu | సికింద్రాబాద్ (Secunderabad)లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. సిటీ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నగరవ్యాప్తంగా ఉత్సవాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు ముగిశాయన్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.
Lashkar Bonalu | భక్తులు సహకరించాలి
ఏఐ వ్యవస్థ ద్వారా ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలతో ముఖాలను విశ్లేషించే ‘ఫేషియల్ రికగ్నిషన్’ సాంకేతికతను ఉపయోగిస్తున్నామని సీపీ తెలిపారు. దీంతో పాత నేరస్థులు, గొలుసు దొంగలు, జేబుదొంగలను గుర్తించి అప్రమత్తమయ్యే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆలయంలోకి వచ్చే, వెళ్లే భక్తుల సంఖ్యను క్యూ మేనేజ్‌మెంట్ ద్వారా కచ్చితంగా లెక్కిస్తామని పేర్కొన్నారు. బోనాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు.
దీనిని కూడా చదవండి : Indian Deportation USA | అమెరికా నుంచి 4,840 మంది భారతీయుల బహిష్కరణ : విదేశాంగ శాఖ