అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mamata Banerjee TMC | పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్‌లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రిటబ్రత బెనర్జీ నాయకత్వంలోని తృణమాల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మమతను టీఎంసీ (TMC) చీఫ్ పదవి నుంచి తప్పించారు.
దీనికితోడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని ఆ పదవి నుంచి తప్పించమే కాకుండా.. పార్టీ నుంచి ఏకంగా సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులు ప్రకటించారు. ఇక దీదీ స్థానంలో నూతన ఛైర్మన్‌గా హౌరా సెంట్రల్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను నియమించారు.

Mamata Banerjee TMC | పలు కీలక నిర్ణయాలు..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇటీవల టీఎంసీ శాసనసభా పక్షం రెండుగా చీలింది. రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో సుమారు 60 మంది శాసన సభ్యులు తిరుగుబావుటా ఎగురేశారు.
ఈ క్రమంలో శాసనసభలో ప్రతిపక్ష నేత రిటబ్రత బెనర్జీ నేతృత్వంలో సోమవారం (జూన్ 22) కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలో టీఎంసీ తిరుగుబాటు వర్గం సమావేశమైంది.
సుమారు 60 మంది రెబల్ ఎమ్మెల్యేలతోపాటు 70 మంది కౌన్సిలర్లు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీఎంసీ చీఫ్ మమతను పార్టీ ఛైర్పర్సన్ పదవి నుంచి తొలగించారు. మమతా బెనర్జీ స్థానంలో సీనియర్ నాయకుడు అరూప్ రాయ్‌ను నూతన ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు.

Mamata Banerjee TMC | TMC నూతన కార్యవర్గం
తమదే ఒరిజినల్ టీఎంసీ అని ప్రకటించుకున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. తాజాగా పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పార్టీ జాతీయ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
సీనియర్ నాయకులు అరూప్ బిశ్వాస్, ఫిర్హాద్ హకీమ్, రథిన్ ఘోష్, సబినా యాస్మిన్ లను టీఎంసీ పార్టీ వైస్ ఛైర్మన్లుగా నియమించారు.
టీఎంసీ జాతీయ కార్యవర్గాన్ని 2022, ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు పునరుద్ధరించలేదని ఈ సందర్భంగా రెబల్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందాక.. వరుస దెబ్బలతో సతమతమవుతున్న మమతకు ఇది భారీ ఎదురు దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.