అక్షరటుడే వెబ్‌డెస్క్: Matrimonial Fraud Case | పెళ్లి పేరుతో సానుభూతిని ఆసరాగా చేసుకుని మహిళలను మోసం చేస్తున్న ఒక కేటుగాడిని మహారాష్ట్ర ( Maharashtra ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అనూజ్ కుమార్ చంద్రప్రకాష్ త్రివేది అనే వ్యక్తి, మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ పేర్లతో ప్రకటనలు ఇచ్చి 25 మందికి పైగా మహిళల దగ్గర కోట్ల రూపాయలు కాజేశాడు.
Matrimonial Fraud Case | కేసు వెలుగులోకి వచ్చింది ఇలా..
2019లో వార్తాపత్రికలో వచ్చిన వివాహ ప్రకటన చూసి, తన మనవరాలిని అజయ్ అగర్వాల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు ఒక వృద్ధురాలు. అయితే, పెళ్లయ్యాక కొత్త ఫ్లాట్ కొంటానని, ఇల్లు కడతానని నమ్మించి సదరు వ్యక్తి బాధితురాలి నుంచి రూ. 82 లక్షల నగదు వసూలు చేశాడు. అనంతరం, 2022 ఫిబ్రవరిలో బంధువుల పెళ్లికి వెళ్తున్నానని చెప్పి, 33 తులాల బంగారంతో ఉడాయించాడు. ఈ మేరకు వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు మోసం బయటపడింది.
Matrimonial Fraud Case | దివ్యాంగులు, వితంతువులే టార్గెట్..
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. నిందితుడు త్రివేది ప్రధానంగా వితంతువులు, దివ్యాంగులు , ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకునేవాడు. వారి పట్ల సానుభూతి చూపిస్తూ పెళ్లి చేసుకుని, ఆ తర్వాత డబ్బు, బంగారంతో పరారవ్వడం ఇతడికి అలవాటు. ఇలా మోసం చేసిన డబ్బుతో అతను విలాసవంతమైన బీఎండబ్ల్యూ కారును కూడా కొనుగోలు చేశాడు.
Matrimonial Fraud Case | కొడుకు కూడా భాగస్వామే..
ఈ మోసపూరిత వ్యవహారంలో త్రివేదికి అతని కుమారుడు కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తండ్రీకొడుకులిద్దరిపై కేసులు నమోదు చేసి, వారి వద్ద ఉన్న బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి వేదికలను ఆసరాగా చేసుకుని ఇంత పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడటం స్థానికంగా సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: Bandi Sanjay Students | విద్యార్థులకు బండి సంజయ్ ‘గిఫ్ట్’.. సైకిళ్ల పంపిణీ
