Medak Gold Loan Scam | బెట్టింగ్‌లకు బానిసై బ్యాంకుకే కన్నం వేసిన మేనేజర్.. రూ. 1.49 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Medak Gold Loan Scam | బెట్టింగ్‌, online గేమింగ్ లకు బానిసై, తాను పని చేస్తున్న బ్యాంకుకే ఓ మేనేజర్ కన్నం వేశాడు. నకిలీ బంగారం కుదువపెట్టి ఏకంగా రూ. 1.49 కోట్ల మేర బ్యాంకును ముంచిన దిగ్భ్రాంతికర ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో వెలుగుచూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మేనేజర్ భార్యతో పాటు అతనికి సహకరించిన స్నేహితుడిని అరెస్టు చేశారు.

Medak Gold Loan Scam | భార్య, స్నేహితుల పేర్లతో మాయాజాలం

పోలీసుల కథనం ప్రకారం.. అనిల్ అనే వ్యక్తి మెదక్ లోని ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. బెట్టింగ్‌ల వల్ల భారీగా అప్పుల పాలైన అనిల్.. వాటిని తీర్చడానికి బ్యాంకు సొమ్మును కాజేయాలని పథకం రచించాడు. ఈ క్రమంలో తన భార్య, స్నేహితుల ఆధార్, పాన్ కార్డులను దుర్వినియోగం చేస్తూ బ్యాంకులో విడతలవారీగా 16 నకిలీ ఖాతాలు తెరిచాడు.

Medak Gold Loan Scam | ఒక్క గ్రాము బంగారంతో కోట్ల రూపాయల రుణం

ఖాతాలు ఓపెన్ చేసిన తర్వాత, కేవలం 1 గ్రాము బరువుండే తక్కువ నాణ్యత గల గోల్డ్ ఆభరణాలను బ్యాంకులో పెట్టాడు. మేనేజర్ స్థానంలో తనే ఉండటంతో, ఆ 1 గ్రాము ఆభరణాలనే అసలైన భారీ పసిడి ఆభరణాలుగా నమ్మించి రికార్డులను తారుమారు చేశాడు. ఆ నకిలీ ఆభరణాలపై ఏకంగా రూ. 1.49 కోట్ల మేర గోల్డ్ లోన్లు మంజూరు చేయించుకుని, ఆ డబ్బును డ్రా చేసుకున్నాడు.

Medak Gold Loan Scam | గతంలో ఏపీలోనూ ఇలాంటి ఘరానా మోసమే!

బ్యాంకు అంతర్గత తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడటంతో పోలీసులకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడు అనిల్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహాలో బ్యాంకు కుంభకోణాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

ఇద్దరి అరెస్ట్.. ప్రధాన నిందితుడి కోసం గాలింపు

ఈ ఘరానా మోసానికి సహకరించిన మేనేజర్ అనిల్ భార్యను, అతని స్నేహితుడు సుబ్రమణ్యంను పోలీసులు అరెస్టు చేశారు. వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, ప్రస్తుతం ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.

బ్యాంక్ మేనేజర్ అనిల్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. బ్యాంకు ఖాతాదారుల సొమ్ముకు ఎలాంటి ఢోకా లేదని, నిందితుడి నుంచి రికవరీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

T-SAT Education Department | ఇక విద్యాశాఖ పరిధిలోకి టీ-శాట్.. ఐటీ శాఖ నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *