అక్షరటుడే వెబ్‌డెస్క్: Ponnam Prabhakar | ఎల్లారెడ్డిపేట మండలంలోని కేశవాపూర్ గ్రామంలో నిర్వహించిన “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గ్రామ ప్రజలు, రైతుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సమీక్షించారు.
Ponnam Prabhakar | గ్రామంలో అమలవుతున్న పథకాలు..
గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. గ్రామంలో మొత్తం 506 పిన్షన్లు ఉండగా, ఏడాదికి సుమారు రూ.1.44 కోట్ల మేర నిధులు విడుదలవుతున్నాయి. మొదటి దశలో 22 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా నిర్మాణాలు తుది దశకు చేరగా, రెండో దశలో మరిన్ని ఇళ్లకు త్వరలో ప్రొసీడింగ్స్ జారీ చేయనున్నారు. అలాగే 526 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 630 కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ అందుతోంది. మహిళా సాధికారత కోసం 86 మహిళా సంఘాలకు రూ.49.67 లక్షల వడ్డీలేని రుణాలు, 72 సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.16.96 కోట్ల రుణాలు విడుదల చేశారు. రైతు సంక్షేమం కోసం 5,486 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.5.03 కోట్లు, 7 మందికి రైతు బీమా కింద రూ.35 లక్షలు, 447 మందికి రూ.3.91 కోట్ల రుణమాఫీ, 192 మందికి రూ.44.82 లక్షల సన్నవడ్ల బోనస్ అందజేశారు. ఆయిల్ఫామ్ సాగుకు సంబంధించి 11 మంది రైతులకు రూ.53 లక్షల ఆర్థిక సహాయం అందించారు. వీటితో పాటు 150 కొత్త రేషన్ కార్డులు, 365 భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, 45 కళ్యాణ లక్ష్మి, 2 షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
Ponnam Prabhakar | గ్రామస్థుల ప్రధాన వినతులు ..
కేశవాపూర్ నుంచి గూడూరు, అంబాల, పెంబర్తి గ్రామాలకు సరికొత్త రహదారుల నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు మంత్రిని కోరారు. కేశవాపూర్ ఎస్సీ కాలనీ వరకు, పెద్దమ్మ గుడి నుంచి చర్చి వరకు సీసీ రోడ్ల నిర్మాణం, విడతల వారీగా గ్రామంలో సీసీ రోడ్ల విస్తరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గతంలో నిర్మించిన నందిపయ్య కాలువ పునరుద్ధరణ, రెండు పెద్ద చెరువులకు బౌండరీలు ఏర్పాటు చేయడం, గ్రామ శివారులోని గత బైపాస్ రోడ్డును పునరుద్ధరించడం వంటి ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గుంటూరు పల్లె నుంచి కేశవాపూర్ వరకు రూ.3.5 కోట్లతో రోడ్డు పనులు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలో మొదటి దశలో 3,500, రెండో దశలో మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల సమస్యల పరిష్కారానికే తాము నేరుగా గ్రామాలకు వస్తున్నామని స్పష్టం చేశారు.
Ponnam Prabhakar | ప్రత్యేక కార్యక్రమాలు ..
రైతులు ఆయిల్ఫామ్ సాగు వైపు వస్తే కోతుల బెడద తప్పుతుందని, ఎకరాకు ఏడాదికి లక్ష రూపాయలకు తక్కువ కాకుండా స్థిరమైన ఆదాయం వస్తుందని తెలిపారు. కేశవాపూర్‌లో 300 ఎకరాల్లో ఆయిల్ఫామ్ సాగు చేస్తే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలంలో కేశవాపూర్‌ను ‘సోలార్ మోడల్ విలేజ్’గా ఎంపిక చేశామని, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ అందించడంతో పాటు అదనపు కరెంట్‌ను విక్రయించే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
కొత్త పెన్షన్లు & స్టీల్ బ్యాంకులు..
వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు తదితరులు కొత్త పెన్షన్ల కోసం ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని బీసీ మహిళలకు 1,000 కుట్టు మిషన్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా కేశవాపూర్ గ్రామంలోని మూడు మహిళా సంఘాలకు వరుసగా 300, 400, 500 చొప్పున మొత్తం 1,200 స్టీల్ బ్యాంకులను అందజేశారు. ఈ స్టీల్ బ్యాంకుల్లోని 13 రకాల సామగ్రిని వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, స్టీల్ వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 173 గ్రామాల్లోని మహిళా సంఘాలకు ఈ స్టీల్ బ్యాంకులను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Ponnam Prabhakar | విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి..
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థుల సంఖ్యను పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వర్షాకాలంలో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయాలని, పల్లె దవాఖానల్లో ఎల్లప్పుడూ తగినన్ని మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా కేశవాపూర్తో పాటు తిమ్మాపూర్, గుంటూరుపల్లి, ఆరేపల్లి, బావుపేట గ్రామాల్లోని ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోత్కుపల్లి శ్రీకాంత్ రెడ్డి, తిమ్మాపూర్ సర్పంచ్ ముప్పు మానస, ఇతర సర్పంచులు, మండల పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, అశోక్ రెడ్డి, ముప్పు మహేందర్, జిల్లా , మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో పర్యటించడం జరిగింది.
గ్రామ పంచాయతీ వద్ద వివిధ శాఖల అధికారులతో గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది.… pic.twitter.com/uFRloAYSrq
— Ponnam Prabhakar (@Ponnam_INC) August 20, 2026
ఇది కూడా చదవండి: Ponguleti on BRS | ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఫెయిల్ : పొంగులేటి