Lucknow Murder Case | భార్యను చంపి వాట్సాప్ స్టేటస్.. ఆపై ఇంకో దారుణం, చివరికి సూసైడ్

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో గోమతీనగర్‌లో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన వెలుగు చూసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Lucknow Murder Case | ఉత్తరప్రదేశ్‌లోని లక్నో గోమతీనగర్‌లో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను కాల్చి చంపి, ఆ విషయాన్ని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. అనంతరం ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న తన సోదరిని కూడా హతమార్చి, చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Lucknow Murder Case | పోలీసులు వెల్లడించిన వివరాలు..

లక్నోకు చెందిన మానస్ బాజ్‌పాయ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య దివ్య మిశ్రాతో కొంతకాలంగా కుటుంబ వివాదాలు నడుస్తున్నాయి. ఈ దంపతులు దాదాపు ఏడాది కాలంగా విడిగా ఉంటుండగా, వీరికి సంబంధించిన కేసు ఫ్యామిలీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో గురువారం రోజున దివ్య తన విధుల్లో భాగంగా గోమతీనగర్‌లోని ఓ బ్యాంకుకు వెళ్లగా.. అక్కడకు చేరుకున్న మానస్ బ్యాంకు బయటే ఆమెపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన దివ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Lucknow Murder Case | స్టేటస్ పెట్టి మరీ..

భార్యను హత్య చేసిన అనంతరం మానస్ నేరుగా తన ఇంటికి వెళ్లాడు. భార్య తనను మోసం చేసిందనే ఆరోపణలతో పాటు, తన సోదరిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మొబైల్ వాట్సాప్ స్టేటస్‌లో రాసుకొచ్చాడు. అంతేకాకుండా కొందరి పేర్లను ప్రస్తావిస్తూ వారికి ఈ విషయాలన్నీ తెలుసని పేర్కొన్నాడు. ఈ స్టేటస్ చూసి అనుమానం వచ్చిన పొరుగువారు అతడికి ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఇంటికి వెళ్లి తలుపు తట్టినా తీయకపోవడంతో.. కొందరు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ మానస్, అతడి సోదరి సీమ శవాలుగా కనిపించారు. ఆ సమయంలో ఇంట్లో టీవీ ఆన్‌లో ఉండటంతో పాటు హనుమాన్ చాలీసా ప్లే అవుతున్నట్లు స్థానికులు తెలిపారు.

మానస్‌కు కొన్ని మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నాడని సమాచారం. మానస్ తల్లిదండ్రులు ఇప్పటికే మృతి చెందగా, అనారోగ్యంతో బాధపడుతున్న సోదరి సీమ అతడితోపాటే ఉంటోంది. ఈ హత్యలను ముందుగానే పథకం ప్రకారం చేశాడా? లేక మానసిక ఒత్తిడే కారణమా? అనే కోణంలో పోలీసులు అన్ని యాంగిల్స్‌లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇది చదవండి:  Ponnam Prabhakar | ఆయిల్‌ఫామ్ సాగు చేస్తే గ్రామ అభివృద్ధికి రూ.10 లక్షలు: మంత్రి పొన్నం ప్రభాకర్!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *