అక్షరటుడే, కామారెడ్డి: School Reopening | స్కూళ్లు పున:ప్రారంభంపై ‘అమావాస్య’ (amavasya) ఎఫెక్ట్ కనిపిస్తోంది. దీంతో చాలావరకు ప్రైవేట్ పాఠశాలలు(private schools) షెడ్యూల్ కన్నా ఒకరోజు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.
School Reopening | నెలన్నర తర్వాత..
ఉమ్మడి జిల్లాలో నెలన్నర తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈనెల 12నే పాఠశాలలు ప్రారంభించాల్సి ఉన్నా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల వినతి మేరకు మూడు రోజులు ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటిదాకా ఇంటివద్ద ఆడుతుపాడుతూ గడిపిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి అంత ఈజీగా ఆసక్తి చూపే అవకాశం లేదు. అయితే ఎంతమేరకు వెళ్తారనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అమావాస్య అడ్డంకిగా మారింది. శుభం, అశుభం లెక్కలు వేసే తల్లిదండ్రులు కొత్తగా బడిలో చేరే చిన్నారులను మొదటి రోజు పంపేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో రేపు బడులకు వెళ్లే విద్యార్థుల సంఖ్యపై సందిగ్ధత నెలకొంది.
School Reopening | కొత్తగా బడికి పంపడానికి నిరాకరణ
ముఖ్యంగా ఒకటో తరగతి, ఎల్‌కేజీ, యూకేజీలో కొత్తగా చేరే పిల్లలను అమావాస్య రోజున బడికి పంపితే మంచిది కాదనే మూఢనమ్మకం గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉంది. మంచి రోజు చూసుకుని పంపుతాం.. ఒకరోజుతో పోయేదేముందని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో కొత్త అడ్మిషన్లలో మొదటిరోజు హాజరు పడిపోయే అవకాశం కనిపిస్తోంది.
School Reopening | రెండు రోజులు ఆలస్యంగానే హాజరు
అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి, విదియ రోజుల్లోనే పిల్లలను బడికి పంపాలని చాలామంది నిర్ణయించుకున్నారు. దీంతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం రెండు రోజులు ఆలస్యంగా కళ తప్పనుంది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు సైతం మొదటి రోజు హాజరు తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నాయి.
School Reopening | ఈసారి అమావాస్య..
ప్రతి ఏడాది మొదటి రోజు 70-80శాతం హాజరు నమోదయ్యేది. కానీ ఈసారి అమావాస్య కారణంగా 40-50శాతం దాటడం కష్టమేనని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పాఠాలు చెప్పేది మూడో రోజు నుంచే మొదలుపెట్టాలి. అప్పటిదాకా వచ్చిన పిల్లలకు ఆటపాటలే అని ఓ ప్రధానోపాధ్యాయుడు వ్యాఖ్యానించారు. మూఢనమ్మకాలతో విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఆటంకం ఏర్పడటంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యాశాఖ(Department of Education) మాత్రం అమావాస్యకు, చదువుకు సంబంధం లేదు. మొదటి రోజే పిల్లలను బడికి పంపండి అని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తోంది.

ఇది కూడా చదవండి : FIFA Stadium Alcohol | ‘మందు’బాబు క్రేజీ ఐడియా.. స్టేడియంలోకి ఫోన్ కవర్‌లో మద్యం తెచ్చిన అభిమాని