అక్షరటుడే వెబ్‌డెస్క్: Mercedes Electric GLC | లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్-బెంజ్ ఇండియా (Mercedes-Benz India) దేశీయ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని దాటింది. మహారాష్ట్ర పూణేలోని చాకన్ తయారీ కేంద్రంలో ‘ఆల్-న్యూ ఎలక్ట్రిక్ GLC’ (GLC 400 4MATIC Electric) స్థానిక ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, సునేత్రా పవార్, మెర్సిడెస్-బెంజ్ గ్లోబల్ నాయకత్వ ప్రతినిధులు ఓలా కల్లెనియస్, మార్టిన్ బ్రూడెర్ ముల్లర్, డాక్టర్ జోర్గ్ బర్జర్, మెర్సిడెస్-బెంజ్ ఇండియా ( India )ఎండీ & సీఈఓ సంతోష్ అయ్యర్ సమక్షంలో తొలి ఎలక్ట్రిక్ కారు అసెంబ్లీ లైన్ నుంచి బయటకు వచ్చింది.
Mercedes Electric GLC | ఎలక్ట్రిక్ GLC ప్రత్యేకతలు ..
ఈ కొత్త ఎలక్ట్రిక్ GLC మెర్సిడెస్-బెంజ్ రూపొందించిన నెక్స్ట్ జనరేషన్ ‘MB.EA-M’ ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా భారత్‌లో తయారవుతున్న మొదటి వాహనం. అంతేకాకుండా ‘ఎమ్‌బీ.ఓఎస్’ (MB.OS) ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్థానికంగా రూపుదిద్దుకున్న తొలి మోడల్‌గా నిలిచింది. జర్మనీలోని బ్రెమన్ (Bremen) ప్లాంట్ తర్వాత ఈ కొత్త ఎలక్ట్రిక్ GLCని ఉత్పత్తి చేస్తున్న ప్రపంచంలోనే రెండో ప్లాంట్‌గా పూణే రికార్డు సృష్టించింది. సంప్రదాయ ఇంధన (combustion engine) వాహనాలు తయారయ్యే ఫ్లెక్సిబుల్ అసెంబ్లీ లైన్‌పైనే ఈ ఎలక్ట్రిక్ కారును కూడా ఉత్పత్తి చేస్తున్నారు.
Mercedes Electric GLC | రూ. 200 కోట్ల అదనపు పెట్టుబడి ..
తయారీ ప్రక్రియ డిజిటలైజేషన్, నూతన ప్రాజెక్ట్‌లు, ఉత్పత్తి పెంపు కోసం 2026లో కంపెనీ రూ. 200 కోట్ల అదనపు నిధులను కేటాయించింది. దీంతో భారత్‌లో మెర్సిడెస్-బెంజ్ మొత్తం పెట్టుబడి రూ. 3,200 కోట్లకు చేరుకుంది. ఆల్-న్యూ ఎలక్ట్రిక్ GLC 400 4MATIC మోడల్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 78.50 లక్షలుగా నిర్ణయించారు. దీని డెలివరీలు నవంబర్ 2026 మధ్య నుంచి ప్రారంభం కానున్నాయి. కాంప్లిమెంటరీ ఏసీ వాల్-బాక్స్‌కు ప్రత్యామ్నాయంగా ‘MB.CHARGE’ పబ్లిక్ ఛార్జింగ్ క్రెడిట్స్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.
Mercedes Electric GLC | మేనేజ్‌మెంట్ ధీమా..
మెర్సిడెస్-బెంజ్ గ్రూప్ ఏజీ ఛైర్మన్ ఓలా కల్లెనియస్ మాట్లాడుతూ.. భారత్ తమకు ఎంతో కీలకమైన మార్కెట్ అని, డిజైన్, కంఫర్ట్, ఆవిష్కరణలతో పాటు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్‌ను ఈ కారు అందిస్తుందని తెలిపారు. సీటీఓ డాక్టర్ జోర్గ్ బర్జర్ మాట్లాడుతూ.. స్థానిక ఇంజనీరింగ్ నైపుణ్యాలు , గ్లోబల్ టెక్నాలజీ కలయిక వల్ల ఈ GLC ప్రత్యేకమైనదిగా మారిందని పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం, గ్లోబల్ బోర్డు సభ్యుల సమక్షంలో దీనిని ప్రారంభించడం కంపెనీ ప్రయాణంలో చారిత్రాత్మక ఘట్టమని మెర్సిడెస్-బెంజ్ ఇండియా సీఈఓ సంతోష్ అయ్యర్ అన్నారు.
ఇది కూడా చదవండి: Eagle Force | ఒడిశా నుంచి గంజాయి.. 400 కిలోలు అమ్మిన ముఠా