Mettu Samson Nizamabad Congress | కాంగ్రెస్​లో ముప్పై ఏళ్ల నమ్మకానికి మిగిలింది అవమానాలేనా? నిజామాబాద్ రూరల్‌లో ఓ సీనియర్​ నేత ప్రశ్న.. నెట్టింట వైరల్​!

"నిన్న మొన్నటి దాకా బీఆర్‌ఎస్, బీజేపీల్లో ఉండి కాంగ్రెస్ సిద్ధాంతాలను తిట్టిన నాయకులు నేడు అధికారంలోకి రాగానే వేదికల మీద అగ్రభాగాన కూర్చుంటుంటే, ముప్పై ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న మేము కింద కూర్చొని ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోంది. ప్రొటోకాల్ ఇబ్బందులతో నిత్యం అవమానాలు భరిస్తున్నాం." — లేఖలో సీనియర్ నేత ఆవేదన

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mettu Samson Nizamabad Congress | పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. లాఠీ దెబ్బలు తిన్నా, కేసులకు భయపడకుండా జెండా మోసిన కార్యకర్తలే పార్టీకి అసలైన బలం. కానీ, నేడు అదే పార్టీలో దశాబ్దాలుగా నమ్ముకున్న సీనియర్లకు అవమానాలు, నిన్న మొన్న వచ్చిన వలస నాయకులకు అగ్రతాంబూలాలు దక్కుతుంటే.. ఆ కరడుగట్టిన కాంగ్రెస్ వాది గుండె ఎంతలా క్షోభిస్తుందో వర్ణించడానికి మాటలు చాలవు. సరిగ్గా ఇలాంటి ఒక తీవ్రమైన భావోద్వేగ ఆవేదనే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

డిచ్‌పల్లి మండలం, నడిపల్లి గ్రామానికి చెందిన మెట్టు శాంసన్ అనే సీనియర్ కాంగ్రెస్ నేత, పార్టీ పెద్దలకు రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు పార్టీలోని ‘పెద్దల పెత్తనాన్ని’, త్యాగధనుల నిర్వేదాన్ని ఎండగడుతోంది. నెట్టింట వైరల్​ అవుతున్న ఈ మెసేజ్​ అధిష్ఠానానికి ‘నిఖార్సైన’ కాంగ్రెస్ నినాదాన్ని నివేదిస్తోంది.

Mettu Samson Nizamabad Congress | రాడికల్స్ భయమున్నా వెనుకడుగు వేయలేదు..

తన లేఖలో పేర్కొన్న అంశాల ప్రకారం.. శాంసన్ ప్రస్థానం నేటి నిన్న మొన్నటి రాజకీయం కాదు. 1988లోనే నేటి టీపీసీసీ (TPCC) అధ్యక్షులు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ అప్పటి NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నేటి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్ అప్పటి NSUI జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఉమ్మడి కమిటీలో.. అలాగే కల్లుగీత కార్మికుల సొసైటీ ఛైర్మన్ శేఖర్ గౌడ్ హయాంలో డిచ్‌పల్లి మండల NSUI అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

1990లో జిల్లా ఉపాధ్యక్షుడిగా.. 1994లో మహేష్ కుమార్ గౌడ్ కి డిచ్‌పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు, నాడు ప్రాంతంలో రాడికల్స్ భయాలు, తీవ్రమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రాణాలకు సైతం తెగించి నియోజకవర్గమంతా తిరిగి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు.

1996లో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2014లో డిచ్‌పల్లి మండల బీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మండల కో-ఆప్షన్ మెంబర్‌గా సేవలందించారు.

గడిచిన పదేళ్ల బీఆర్‌ఎస్ (TRS) హయాంలో అధికార పక్షం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా కాంగ్రెస్ జెండాను వదల్లేదు. మొన్నటి ఎన్నికల్లోనూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో చెమటోడ్చారు.

Banswada Hospital Cases | బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం: సిజేరియన్ బాలింతలకు తీవ్ర అస్వస్థత.. ముగ్గురు హైదరాబాద్ నిమ్స్‌కు, ఇద్దరు నిజామాబాద్‌కు తరలింపు!

Mettu Samson Nizamabad Congress | డిచ్‌పల్లి కాంగ్రెస్‌కు పట్టిన ‘శాపం’.. వేదికలపై ప్రేక్షక పాత్రేనా?

ఒకప్పుడు ఏ. బాల్ రెడ్డి లాంటి మహానాయకుడి తర్వాత డిచ్‌పల్లి నియోజకవర్గానికి పూర్తి స్థాయి శాశ్వత ఎమ్మెల్యే లేకపోవడం (మధ్యలో ఆకుల లలిత కేవలం 9 నెలలు తాత్కాలికంగా ఉండటం మినహా) ఇక్కడి కాంగ్రెస్ శ్రేణులకు ఒక శాపంగా మారింది. శాశ్వత దిశానిర్దేశం చేసే నాయకుడు కరవై సీనియర్లు అనాథలుగా మిగిలిపోతున్నారు.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన మూల్యం చెల్లించుకోక తప్పదని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఏళ్లుగా పెద్దల పెత్తనానికి బలైపోతూ, కేవలం జెండాలు మోసే కూలీలుగానే మిగిలిపోవాలా? అని ప్రశ్నిస్తున్నారు.

Congress

Mettu Samson Nizamabad Congress | క్రిస్టియన్ మైనారిటీలకు దక్కని ప్రాధాన్యం

అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తుందని నమ్మే కాంగ్రెస్ పార్టీ.. తమలాంటి క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించకూడదని లేఖలో బలంగా ప్రస్తావించారు. పార్టీ కోసం రక్తం ధారపోసిన క్రిస్టియన్ మైనారిటీ నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ పదవుల్లో, కమిటీల్లో తగిన ప్రాధాన్యం, అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధిష్ఠానంపై ఉందన్నారు.

ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. మరి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మా మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అధిష్ఠానం స్పందించి నాడు తమతో కలిసి నడిచిన ఇలాంటి సీనియర్ నేతలకు సముచిత స్థానం కల్పిస్తారా? లేదా వలస నేతల నీడలో పాత కాపులను విస్మరిస్తారా? అనేది చూడాలి.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *