Drunk Driving Cases | నాలుగు నెలల్లో 3,510 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Drunk Driving Cases | ప్రశాంతంగా ఇళ్లకు చేరుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు పదేపదే చెబుతున్నా మందుబాబులు రోడ్డెక్కడం మానడం లేదు. ఫలితంగా పోలీసులకు చిక్కి జరిమానాలు చెల్లించడమో, జైలు శిక్ష అనుభవించడమో చేస్తున్నారు. ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లోనే డ్రంకన్​ డ్రైవ్ ద్వారా 3,510 మంది పోలీసులకు పట్టుబడగా రూ.42లక్షల జరిమానా విధించడంతో పాటు 508 మంది జైలు పాలయ్యారు. శనివారం ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఈ గణాంకాలను వెల్లడించారు.

Drunk Driving Cases | మద్యంతాగి వాహనాలు నడుపుతున్న వారిపై ఉక్కుపాదం

ఎస్పీ మాట్లాడుతూ.. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై పోలీస్​శాఖ ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 8 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంకన్​ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 3,510 మందికి కోర్టులు శిక్షలు విధించాయని ఎస్పీ తెలిపారు. వీరిపై మొత్తం రూ.42.01 లక్షల భారీ జరిమానా విధించగా సమాజ భద్రతను దృష్టిలో ఉంచుకుని 508 మందికి జైలు శిక్షలు ఖరారయ్యాయన్నారు. ఈ చర్యలు మద్యం సేవించి వాహనం నడపడంపై పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో స్పష్టంగా తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. శిక్షల తీవ్రతను పరిశీలిస్తే 499 మందికి ఒక రోజు నుంచి ఐదు రోజుల వరకు జైలు శిక్షలు పడగా, నేర తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది మందికి వారం నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష విధించారన్నారు. ఇద్దరు నిందితులకు ఏకంగా 31 రోజుల పాటు జైలు శిక్ష ఖరారైందని పేర్కొన్నారు.

Drunk Driving Cases | మద్యం తాగి.. ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘిస్తే..

మద్యం తాగి రోడ్డు మీదకు వస్తే కేవలం జరిమానాతో తప్పించుకోవడం సాధ్యం కాదని, అవసరమైతే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం అనేది కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, అది ప్రాణాలతో చెలగాటమాడడంతో సమానమని హెచ్చరించారు. కేవలం జరిమానా కట్టి తప్పించుకోవచ్చనే భావన పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. డ్రంకన్​ డ్రైవ్‌కు పాల్పడిన వారిపై చట్టప్రకారం ఒక రోజు నుంచి నెల రోజుల వరకు జైలు శిక్షతో పాటు జరిమానాలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడం పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: North Korea Nuclear|కిమ్ మరణిస్తే అణు బాంబులే.. ఉత్తర కొరియా సంచలన నిర్ణయం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *