Banswada Hospital Cases | బాన్సువాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం: సిజేరియన్ బాలింతలకు తీవ్ర అస్వస్థత.. ముగ్గురు హైదరాబాద్ నిమ్స్‌కు, ఇద్దరు నిజామాబాద్‌కు తరలింపు!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Banswada Hospital Cases | కామారెడ్డి Kamareddy జిల్లా బాన్సువాడ పరిధిలోని మాతా శిశు సంరక్షణ ప్రభుత్వ ఆసుపత్రి (MCH)లో తీవ్ర కలకలం రేగింది.

ఈ ఆసుపత్రిలో సిజేరియన్ (కాన్పు) ఆపరేషన్లు చేయించుకున్న పది మంది బాలింతల్లో ఐదుగురు మహిళలు ఒకరి తర్వాత ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Banswada Hospital Cases | బాధితుల్లో తీవ్ర లక్షణాలు..

బాధితుల్లో తెల్ల రక్తకణాలు (WBC) పడిపోవడం, తీవ్ర రక్తస్రావం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, మూత్రపిండాల పనితీరు మందగించడం (యూరిన్ అవుట్‌పుట్ తగ్గడం) వంటి తీవ్ర లక్షణాలు కనిపించడంతో వైద్య వర్గాల్లో ఆందోళన మొదలైంది.

బాన్సువాడ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10, 11 తేదీల్లో ఆసుపత్రిలో మొత్తం 10 సిజేరియన్ సర్జరీలు జరిగాయి.

10వ తేదీ రాత్రి ఒక బాలింతకు ఊపిరి ఆడకపోవడంతో తక్షణమే నిజామాబాద్‌కు తరలించారు. 11వ తేదీ సాయంత్రం లక్ష్మీప్రియ అనే మరో బాలింతకు ఛాతిలో నొప్పి, శ్వాస ఇబ్బంది, రక్తకణాలు తగ్గడం వంటి లక్షణాలు కనిపించాయి.

Kamareddy GGH | జీజీహెచ్​లో ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం.. హతాశులైన రోగులు..

Banswada Hospital Cases | పరిస్థితి విషమించడంతో..

నిన్న (12వ తేదీన) మరో ముగ్గురు బాలింతలు కూడా ఇవే లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ముందుజాగ్రత్త చర్యగా బాలింతలను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతున్న వారిలో ఉమేరా ఫాతిమా, రుక్సానా మరియు జ్యోతుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో, ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో హైదరాబాద్‌లోని ‘నిమ్స్’ (NIMS) ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం అత్యవసరంగా తరలించారు.

ప్రస్తుతం లక్ష్మీ ప్రియ, సునీత అనే ఇద్దరు బాలింతలు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Banswada Hospital Cases | నిలిచిపోయిన సర్జరీలు

ఒకేసారి ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రి యంత్రాంగం అప్రమత్తమైంది. ఆపరేషన్ థియేటర్‌లో ఇన్ఫెక్షన్ సోకిందా? లేక ఆపరేషన్ సమయంలో వాడిన మందుల వికటించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ప్రస్తుతానికి బాన్సువాడ ఎంసీహెచ్ ఆసుపత్రిలో సర్జరీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సూపరింటెండెంట్ ప్రకటించారు.

ఆపరేషన్ థియేటర్‌లోని గోడలు, టేబుళ్లు, పరికరాలు, వైద్యుల దుస్తుల నుండి స్వాబ్స్ (Swabs) సేకరించి మైక్రోబయాలజీ ల్యాబ్‌కు పంపించారు.

అలాగే ఆపరేషన్లలో వినియోగించిన అన్ని రకాల మందులను సీజ్ చేసి, నాణ్యతా పరిశీలన కోసం ప్రభుత్వ ల్యాబొరేటరీకి తరలించినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ సహా రాష్ట్ర మాతృత్వ సంరక్షణ విభాగానికి (Maternal Health Department) నివేదించినట్లు డాక్టర్ విజయ్ భాస్కర్ వెల్లడించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *