Mumbai Playoff Chances | ఊపిరి పీల్చుకున్న ముంబై.. లక్నోపై గెలుపుతో ప్లేఆఫ్ ఆశలు సజీవం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mumbai Playoff Chances | ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు, ఎట్టకేలకు లక్నో సూపర్ జెయింట్స్ పై సంచలన విజయంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. మే 4న జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో లక్నోను ఓడించడం ద్వారా ముంబై తన ప్లేఆఫ్ అవకాశాలను నిలబెట్టుకుంది.

అయితే ఈ గెలుపు మాత్రమే సరిపోదు.. ఇక ముందు ప్రతి అడుగు కీలకం. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే నమోదు చేసి, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నప్పటికీ, గణితపరంగా ఇంకా అవకాశాలు ఉన్నాయి.

Mumbai Playoff Chances | అన్నీ గెలవాల్సిందే

ముంబైకి ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ నాలుగింటినీ తప్పకుండా గెలవాలి. మే 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే 14: పంజాబ్ కింగ్స్, మే 20: కొలకతా నైట్ రైడర్స్, మే 24: రాజస్థాన్ రాయల్స్ .. ఈ నాలుగు మ్యాచ్‌లు గెలిస్తే ముంబై ఖాతాలో మొత్తం 14 పాయింట్లు చేరతాయి. ఒక్క మ్యాచ్ ఓడినా ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. ముంబై 14 పాయింట్లు సాధించినా ప్లేఆఫ్ Play off బెర్త్ ఖాయం కాదు. ఇప్పటికే కొన్ని జట్లు 12 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. ఆ జట్లు కనీసం మరో మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్లకు చేరుకుంటాయి. కాబట్టి ముంబై గెలవడంతో పాటు, పైన ఉన్న జట్లలో కనీసం రెండు జట్లు 14 పాయింట్లను దాటకుండా ఆగిపోవాలి.

Mumbai Playoff Chances | భారీ మార్జిన్‌తో గెలవడం చాలా కీలకం

ముంబైకి ప్రస్తుతం నెట్ రన్ రేట్ (NRR) పెద్ద సమస్యగా మారింది. అందుకే మిగిలిన మ్యాచ్‌ల్లో కేవలం గెలవడం కాకుండా, భారీ మార్జిన్‌తో గెలవడం చాలా కీలకం. లక్నోపై భారీ లక్ష్యాన్ని వేగంగా ఛేదించడం వల్ల కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు, నికోలస్ పూరన్ (63) దూకుడు ఇన్నింగ్స్‌తో 228 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ ముంబై బ్యాటర్లు అద్భుతంగా స్పందించారు.

ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma) (84), రియాన్ రికెల్టన్ (83) తొలి వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు బలమైన పునాది వేశారు. చివర్లో నమన్ ధీర్, విల్ జాక్స్ వేగంగా పరుగులు చేయడంతో ముంబై 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొత్తానికి లక్నోపై గెలుపుతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేసులో తిరిగి ప్రవేశించింది. కానీ ఇక ముందు ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’ పరిస్థితిలోనే ఉంది. గెలుపుతో పాటు ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేట్ అన్నీ కలిసొస్తేనే ముంబైకి ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి.

ఇది కూడా చదవండి..: Punjab Kings Fan | సిక్సర్‌తో గాయమైన అభిమానికి అండగా పంజాబ్ కింగ్స్.. వీడియో కాల్ చేసి మ్యాచ్‌కి ఆహ్వానించిన ప్రీతి జింటా

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *