అక్షరటుడే, వెబ్‌డెస్క్: MVI Ravinder Reddy | రవాణా శాఖలో 36 ఏళ్ల పాటు విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) రవీందర్ రెడ్డికి హైదరాబాద్‌లోని ఉప్పల్ ఆర్టీఓ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీఏ జాయింట్ కమిషనర్ వెంకటరమణ, అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, గౌరవాధ్యక్షుడు మోహన్ రెడ్డి, వివిధ జిల్లాల డీటీఓలు, ఆర్టీఓలు, అధికారులు, సిబ్బంది, మిత్రులు, బంధువులు పాల్గొని ఆయనను ఘనంగా సత్కరించారు.
MVI Ravinder Reddy | 36 సంవత్సరాల పాటు
ఈ సందర్భంగా ఆర్టీఏ జాయింట్ కమిషనర్ వెంకటరమణ మాట్లాడుతూ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఏఎంవీఐ, అనంతరం ఎంవీఐ స్థాయికి ఎదిగి 36 సంవత్సరాల పాటు క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించిన రవీందర్ రెడ్డి ఉద్యోగులకు ఆదర్శమని కొనియాడారు.
వాహనాల లైసెన్స్‌ల జారీలో పారదర్శకత పాటిస్తూ ప్రతి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారని ప్రశంసించారు. ఆయన సేవాస్ఫూర్తిని ఇతర అధికారులు, సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగ బాధ్యతలతో పాటు తన వేతనం నుంచి కొంత మొత్తాన్ని కేటాయించి వృద్ధాశ్రమాన్ని నిర్వహించడం ద్వారా రవీందర్ రెడ్డి సమాజ సేవలోనూ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు.
సంఘ సేవ, దైవ కార్యక్రమాల్లోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.

MVI Ravinder Reddy | అందరితో స్నేహపూర్వకంగా..
పదవీ విరమణ పొందిన ఎంవీఐ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 1990 నుంచి 2026 వరకు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో విధులు నిర్వహించే అవకాశం లభించిందని చెప్పారు.
అధికారులు, సహచర ఉద్యోగులు అందించిన సహకారం వల్లే ఎలాంటి ఆటంకాలు లేకుండా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించగలిగానని తెలిపారు. ప్రతి చోట అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ విధి నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చానని పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.