Narendra Modi Record | చరిత్ర సృష్టించిన నరేంద్రమోదీ.. ప్రధానిగా నెహ్రూ రికార్డు బద్దలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో రికార్డు బద్దలు కొట్టారు. దేశంలో అత్యధిక కాలం పాటు పనిచేసిన తొలి ఎన్నికైన ప్రధానిగా చరిత్ర సృష్టించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Narendra Modi Record | స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రధానిగా నరేంద్ర మోదీ మరో మైలురాయిని చేరుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం నిర్విరామ సేవలందించిన దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ తిరగ రాశారు.

వరుసగా మూడు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీ (PM Narendra Modi).. అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా కొత్త రికార్డు సృష్టించారు. ఈ రికార్డు ఇప్పటివరకు నెహ్రూ పేరిట ఉంది. ఆయన 4,398 రోజులపాటు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానిగా ఉన్నారు. ఆ రికార్డును మోదీ అధిగమించారు.

Narendra Modi Record | ఎక్కువ కాలం పనిచేసింది వీరే..

స్వతంత్ర భారత దేశంలో తొలి సాధారణ ఎన్నికలను 1952లో నిర్వహించారు. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన నెహ్రూ.. 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు ప్రధానిగా నిరంతరాయంగా కొనసాగారు. ఆ రికార్డు ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. దానిని ఇప్పుడు మోదీ అధిగమించారు. 2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో బుధవారంతో ఆయన ప్రధానమంత్రి పదవిలో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన రికార్డు నెలకొల్పారు. కాగా ప్రధానమంత్రుల పదవీకాలాల జాబితాలో ఇందిరా గాంధీ 4,077 రోజులతో మూడో స్థానంలో ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 3,652 రోజులు, అటల్ బిహారీ వాజ్‌పేయి 2,272 రోజులు, పీవీ నరసింహారావు 1,827 రోజులు ప్రధానమంత్రులుగా సేవలందించారు.

Narendra Modi Record | ఎదురులేని మోదీ..

Narendra Modi Record

నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబరు 7న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ 2014 మే 21 వరకు.. అంటే 4,610 రోజులు ఏకదాటిగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి ఆయనే ఆ పదవిలో కొనసాగుతున్నారు. మÖడు విడతలలో కలిపి ఇప్పటివరకు 4,399 రోజుల పదవీ కాలం పూర్తయ్యింది. మరో విశేషం ఏమిటంటే ఈ ఏడాది మార్చి 22 నాటికి నరేంద్ర మోదీ సీఎంగా, పీఎంగా కలిపి మొత్తం 8,931 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో భారతదేశ చరిత్రలోనే ఒక ఎన్నికైన ప్రభుత్వానికి అత్యంత సుదీర్ఘ కాలం అధిపతిగా పనిచేసిన నాయకుడిగా సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ (8,930 రోజులు) పేరిట ఉన్న రికార్డును మోదీ బద్దలు కొట్టారు.

ఇది కూడా చదవండి..: Meenakshi Natarajan nomination | మంత్రి కైలాష్ సంచలన వ్యాఖ్యలు.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక అంతర్గత పోరు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *