NEET Exam Pressure | విద్యార్థుల గుండెల్లో ‘ఒత్తిడి’ చిచ్చు.. ఊపిరి తీస్తున్న ‘మెడికల్’ కల!

లొసుగులను, కల్తీలను తక్షణమే ప్రక్షాళన చేయకపోతే... రేపు మన దేశానికి వైద్యం చేసే డాక్టర్లు మిగలరు సరే కదా, భవిష్యత్తును మోసే యువత కూడా శవాలుగా మారిపోతుంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NEET Exam Pressure | ఆ గదిలో ఇంకా పుస్తకాలు తెరిచే ఉన్నాయి. టేబుల్ ల్యాంప్ వెలుగుతోంది. గోడపై ‘ఎంబీబీఎస్ 2026’ అని రాసుకున్న లక్ష్యాల ఛార్ట్ అలాగే ఉంది. కానీ, ఆ కలలను నిజం చేసుకోవాల్సిన ప్రాణం మాత్రం అనంత వాయువుల్లో కలిసిపోయింది.

హైదరాబాద్‌లో కడప విద్యార్థిని, అహ్మదాబాద్‌లో ఒకరు, కోయంబత్తూరు, డెహ్రడూన్​, ఢిల్లీలో ఆశావహులు… ఇలా ఒకరా, ఇద్దరా? దేశవ్యాప్తంగా ‘నీట్’ (NEET) అనే నాలుగు అక్షరాల పరీక్ష సృష్టిస్తున్న ఒత్తిడి సునామీకి ఎందరో చిగురుటాకులు రాలిపోతున్నారు.

వైద్యుడై సమాజానికి సేవ చేయాలనుకున్న విద్యార్థుల కలలు.. నేడు విద్యా వ్యవస్థ అసమర్థత వల్లే శ్మశాన వాటికలుగా మారుతున్నాయి. జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా విద్యార్థుల గుండెల్లో భయం గుప్పిట దాగుంది. అసలు దేశంలో ఏం జరుగుతోంది? తప్పు ఎవరిది? శిక్ష అనుభవిస్తున్నదెవరు?

NEET Exam Pressure | కడప విద్యార్థిని విషాదం: ఒక కంటిపాప ఆరిపోయిన వేళ!

హైదరాబాద్‌లో జరిగిన కడప విద్యార్థిని ఆత్మహత్య ఉదంతం వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, కూలీ నాళీ చేసి తల్లిదండ్రులు ఆమెను చదివించారు. మొదటిసారి పరీక్ష రాసి, మంచి మార్కులు వస్తాయని ఆశపడింది.

కానీ, పేపర్ లీక్ ముఠాల పాపానికి పరీక్ష రద్దయింది. మళ్లీ చదవాలనే ఒత్తిడి, ఈసారి సీటు వస్తుందో లేదోననే భయం, తల్లిదండ్రుల అంచనాలు అందుకోలేకపోవడం తదితర కారణాలతో తీవ్ర ఒత్తడికి లోనైంది.

“నన్ను క్షమించండి అమ్మ-నాన్న” అంటూ ఆ విద్యార్థిని తనువు చాలించింది. ఈ ఘటన దేశ విద్యా విధానంపై మరణ శాసనంగా మారింది. కూతురు డాక్టర్ అవుతుందని ఆశపడ్డ ఆ తల్లిదండ్రుల కడుపుకోతను ఆర్పే శక్తేది? వారి ఏడుపులు ఆ గది నాలుగు గోడల మధ్యే కరిగిపోతున్నాయి.

NEET Exam Pressure

NEET Exam Pressure | కోటా నుంచి కోయంబత్తూరు దాకా!

ఇది ఒక్క హైదరాబాద్ సమస్య మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గుజరాత్ (అహ్మదాబాద్), తమిళనాడు (కోయంబత్తూరు), డెహ్రడూన్​, ఢిల్లీలో ఇలా ఎక్కడ చూసినా నీట్​ చావులు ఆందోళన కలిగిస్తున్నాయి.

రాజస్థాన్ (కోటా): దేశంలో కోచింగ్ హబ్‌గా పిలవబడే కోటా నగరం, ఇప్పుడు ఆత్మహత్యల హబ్‌గా మారుతోంది. ఈ ఏడాది ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. భవనాలపై నుంచి దూకడం, ఫ్యాన్లకు ఉరేసుకోవడం అక్కడ నిత్యకృత్యంగా మారాయి.

ఈ మరణాలన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి: విద్యార్థుల మానసిక దృఢత్వాన్ని పరీక్షలు దెబ్బతీస్తున్నాయి. ఒకసారి రాసిన పరీక్షను రద్దు చేసి, మళ్లీ రాయమనడం అంటే వారిని మానసికంగా నరకంలోకి నెట్టడమే.

akshara today .jpgNEET

NEET Exam Pressure | జాతీయ పరీక్షల బోర్డు (NTA) అసమర్థత కాదా?

కోట్లాది రూపాయల ఫీజులు వసూలు చేసే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతోంది?

పేపర్ లీకేజీల దందా: టెక్నాలజీ ఇంతగా పెరిగిన కాలంలో కూడా దేశవ్యాప్త పరీక్ష పేపర్లు ఎలా లీక్ అవుతున్నాయి? దీని వెనుక ఉన్న కార్పొరేట్ మాఫియాను ఎందుకు అణచివేయలేకపోతున్నారు?

ప్రణాళికా రాహిత్యం: పరీక్ష రద్దు చేసిన తర్వాత, విద్యార్థులకు కనీసం మానసిక కౌన్సెలింగ్ ఇచ్చే ఏర్పాట్లు ఎందుకు లేవు? మళ్లీ పరీక్ష తేదీని ప్రకటించి చేతులు దులుపుకొంటే సరిపోతుందా? వారి మెదడుపై పడే భారాన్ని ఎవరు లెక్కిస్తారు?

పారదర్శకత లోపం: గ్రేస్ మార్కుల పేరిట, ఐడెంటిటీల పేరిట జరుగుతున్న అవకతవకలు వ్యవస్థపై నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టాయి. కష్టపడి చదివే విద్యార్థి కంటే, డబ్బున్నోడికే సీటు వస్తుందనే భావన పిల్లల్లో నైరాశ్యాన్ని నింపుతోంది.

akshara today .jpgchess

NEET Exam Pressure | రాజకీయ చదరంగం

విద్యార్థులు ప్రాణాలు విడుస్తుంటే, మన రాజకీయ నాయకులు మాత్రం దానిని ఒక ఓట్ల చదరంగంగా వాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవస్థను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితమవుతున్నాయి.

విద్యా వ్యవస్థను సంస్కరించాలనే నిజాయితీ గల రాజకీయ సంకల్పం ఏ పార్టీలోనూ కనిపించడం లేదు. విద్యార్థుల ప్రాణాల కంటే వీరికి అధికారమే ముఖ్యమైపోయింది.

NEET Exam Pressure | ఎక్కడ తప్పు జరుగుతోంది?

భారతీయ సమాజంలో ‘డాక్టర్’, ‘ఇంజినీర్’ అయితేనే జీవితం సెటిల్ అయినట్టు భావించే ఒక రుగ్మత ఉంది. తల్లిదండ్రులు తమ అశలను పిల్లలపై రుద్దుతున్నారు. తాము పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదని, వారిని చిన్నప్పటి నుంచే కోచింగ్ సెంటర్లనే జైళ్లలో బంధిస్తున్నారు.

ర్యాంకులే పరమావధిగా సాగే కార్పొరేట్ విద్యాసంస్థలు పిల్లలను కేవలం మార్కుల మిషన్లుగానే చూస్తున్నాయి తప్ప, వారిలో జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వడం లేదు. “సీటు రాకపోతే నా తల్లిదండ్రుల ముఖం ఎలా చూడాలి? సమాజం నన్ను చేతకానివారిగా ముద్రిస్తుందా?” అనే భయమే విద్యార్థులను ఉరితాళ్ల వైపు నడిపిస్తోంది.

NEET Exam Pressure | జూన్ 21న పరీక్ష: ఇప్పుడున్న తక్షణ అవసరం ఏంటి?

మరో కొన్ని గంటల్లో నీట్ పునర్నిర్వహణ జరగబోతోంది. ఈ తరుణంలో ప్రభుత్వం, సమాజం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి:

ఉచిత మానసిక కౌన్సెలింగ్: ప్రతి జిల్లా కేంద్రంలో, విద్యా సంస్థల్లో నీట్ రాసే విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్లు, కౌన్సెలింగ్ కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలి. వారికి ధైర్యం చెప్పాలి.

కఠిన చట్టాలు: పేపర్ లీకేజీలకు పాల్పడే వారిని ఉగ్రవాదులుగా పరిగణించి, కఠినంగా శిక్షించేలా చట్టాలు తేవాలి.

తల్లిదండ్రులకు విజ్ఞప్తి: మీ బిడ్డ ప్రాణం కంటే ఏ మెడికల్ సీటూ, ఏ ర్యాంకూ ముఖ్యం కాదు. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. పిల్లలకు తోడుగా నిలవండి, వారికి “నేనున్నాను” అనే నమ్మకాన్ని ఇవ్వండి.

పరీక్షలు అనేవి జీవితాన్ని తీర్చిదిద్దడానికి ఉండాలి కానీ, జీవితాలనే తుడిచేసేలా ఉండకూడదు. విద్యా వ్యవస్థలో ఉన్న లొసుగులను, కల్తీలను తక్షణమే ప్రక్షాళన చేయకపోతే… రేపు మన దేశానికి వైద్యం చేసే డాక్టర్లు మిగలరు సరే కదా, భవిష్యత్తును మోసే యువత కూడా శవాలుగా మారిపోతుంది. ఇకనైనా మేల్కొందాం… మరో నిండు ప్రాణం బలికాకముందే ఈ వ్యవస్థను మారుద్దాం!

Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *