అక్షరటుడే వెబ్డెస్క్: Nepal Flood Humanity | భారీ వర్షాలు, ప్రళయకారక వరదలతో నేపాల్ తీవ్రంగా అల్లాడిపోతోంది. కొండచరియలు విరిగిపడి, నదులు ఉప్పొంగడంతో వందలాది ఇళ్లు, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. ఈ విపత్తు సమయంలో మానవత్వంలోని రెండు విరుద్ధమైన కోణాలు బయటపడ్డాయి. ఒకవైపు కొందరు అమానుషంగా ప్రవర్తించగా, మరోవైపు కొందరు తమ నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నారు.
Nepal Flood Humanity | ఆభరణాలు దొంగిలించిన వైనం..
నారాయణి నది ఒడ్డుకు వరద ప్రవాహంలో ఓ మహిళ మృతదేహం కొట్టుకొచ్చింది. అయితే ఆ శవంపై ఉన్న బంగారు కమ్మలను కొందరు దుండగులు దొంగిలించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో (Social media )వైరల్ కావడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై స్పందించిన నేపాల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ఆ ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
Nepal Flood Humanity | అద్భుత సంఘటన ..
మరోవైపు, ఇదే వరదల్లో మానవత్వాన్ని చాటిచెప్పే అద్భుత సంఘటన చోటుచేసుకుంది. త్రిశూలి నది ఉధృతికి మట్టితో కూడిన ఒక కబోర్డ్ (అల్మారా) కొట్టుకొచ్చింది. నిర్మల్ పర్సాయి అనే యువకుడు, అతని స్నేహితులు ఆ కబోర్డును తెరిచి చూడగా.. అందులో పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు లభించింది. అల్మారాలోని ఒక బిల్లు ఆధారంగా అది ఓ నగల షాపునకు చెందినదిగా గుర్తించారు.
కోట్లాది రూపాయల విలువైన ఆ సంపదను చూసి ఆ యువకులు ఏమాత్రం ఆశపడలేదు. సోషల్ మీడియా వేదికగా తమకు బంగారం, నగదు దొరికిన విషయాన్ని వెల్లడించారు. సరైన ఆధారాలతో తమను లేదా స్థానిక పోలీసులను సంప్రదించి తమ ఆస్తిని తీసుకెళ్లాలని యజమానులను కోరారు. విపత్కర పరిస్థితుల్లోనూ స్వార్థం లేకుండా వ్యవహరించి, బాధితులకు వారి ఆస్తిని అప్పగించేందుకు ముందుకొచ్చిన ఆ యువకుల నిజాయితీని నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఇది కూడా చదవండి: Annamalai Film Remarks | సినిమాల్లో మితిమీరిన హింస.. సెన్సార్ బోర్డు తీరుపై అన్నామలై ఆగ్రహం