Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్ లక్కీడ్రా ప్రారంభం

హైదరాబాద్ మహానగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే 'ఇందిరమ్మ టవర్స్' నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Indiramma Towers | హైదరాబాద్ మహానగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయాలను వెల్లడించారు. అర్హతే ప్రామాణికంగా, కులమతాలు , రాజకీయాలకు అతీతంగా ఈ ఎంపికలు జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Indiramma Towers | మొదటి విడత లక్కీడ్రా ..

క్యూర్ (CURE) పరిధిలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపు కోసం అత్యంత పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహిస్తున్నారు. మీడియా, అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో ఈ డ్రా తీస్తూ, మొత్తం ప్రక్రియను అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

శుక్రవారం నాంపల్లి, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కోసం లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్‌లో నిర్మించనున్న టవర్స్‌కు సంబంధించి వెట్‌ గార్డెన్స్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా పాల్గొని డ్రా తీశారు.

ఈ నెల 31వ తేదీ వరకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో తుది పరిశీలన నిర్వహిస్తారు. ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే, మిగిలిన 120 మందిలోని అర్హులకు అవకాశం కల్పిస్తారు. ఈ విధానం ద్వారా అర్హులైన పేదలకు వంద శాతం న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.

Indiramma Towers | ఇళ్ల నిర్మాణం..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 13న కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేశారని మంత్రి గుర్తుచేశారు. రికార్డు సమయంలోనే 16 నియోజకవర్గాల్లో టెండర్లు పిలవడం, మరోవైపు లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీడ్రా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ ఘనత అని అన్నారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు. మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, ఆయా ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రతి ఇంటికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తోంది. చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయి. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి, లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేస్తున్నామని, మరో పది రోజుల్లో ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుందని తెలిపారు.

Indiramma Towers | పేదల ఆత్మగౌరవమే ముఖ్యం..

ప్రభుత్వానికి డబ్బు కూడబెట్టుకోవడం కంటే పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా సొంత ఇంటిని అందించడమే ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎకరం రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్లు విలువ చేసే ప్రాంతాల్లోనూ పేద కుటుంబాలు గౌరవంగా జీవించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని పేర్కొన్నారు.

Indiramma Towers | ఉచిత రిజిస్ట్రేషన్ ..

ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు పొందిన అర్హులైన లబ్ధిదారులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్ అయిన పదేళ్ల తర్వాత అవసరాన్ని బట్టి ఇంటిని విక్రయించుకునే సదుపాయం ఉంటుంది. అంతకుముందే అత్యవసరమైతే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను బ్యాంకులో కుదువ పెట్టుకుని రుణం పొందే అవకాశం ఉంది. లక్కీడ్రాలో ఇల్లు పొందిన ప్రతి లబ్ధిదారుడికి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించి ఇస్తారు. ఒక్కో ఇంటికి 17 నుంచి 20 గజాల అన్‌డివైడెడ్‌ షేర్‌ భూమి లభిస్తుంది. ప్రభుత్వం గుర్తించిన స్థలాల్లో అవసరాన్ని బట్టి 10 అంతస్తుల వరకు ఇందిరమ్మ టవర్స్‌ నిర్మించి, లిఫ్ట్‌లతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. లక్కీడ్రా పూర్తయిన తర్వాత అధికారుల పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు అందజేసి, కేవలం 3–4 రోజుల్లోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించుకోవచ్చు.

దీనిని కూడా చదవండి : Annamalai Film Remarks | సినిమాల్లో మితిమీరిన హింస.. సెన్సార్ బోర్డు తీరుపై అన్నామలై ఆగ్రహం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *